Thursday, December 5, 2019

SC grants bail to Chidambaram in INX Media money laundering case


ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా ముడుపులు, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ఎదుర్కొంటూ జైలు పాలైన 74 ఏళ్ల ఈ కాంగ్రెస్ కురువృద్ధ నేతకు జస్టిస్ ఎ ఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బయట ఉంటే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చన్న హైకోర్టు వాదనను దేశ సర్వోనత న్యాయస్థానం తోసిపుచ్చింది. 105 రోజులుగా చిదంబరం తీహార్ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు ఇచ్చింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు చాలా తీవ్రమైనవని, అవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా సమాజంలోని ప్రజల విశ్వాసాన్ని సడలిస్తాయని వాదించారు. చిదంబరం తరఫున కేసులో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎ.ఎం. సింగ్వి మెహతాలు తమ వాదనలు వినిపిస్తూ ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేశారని లేదా ఏదైనా సాక్ష్యాలను దెబ్బతీశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్ళరాదని, మీడియాతో మాట్లాడకూడదని ధర్మాసనం ఆదేశించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007 లో రూ .305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఆ సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌.ఐ.పి.బి) క్లియరెన్స్‌ లు లభించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2017 మే 15 న కేసు నమోదు చేసింది. ఆగస్టు 21న ఆయనను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చిదంబరాన్ని అక్టోబర్ 16న అరెస్ట్ చేసింది. దాంతో సీబీఐ కేసులో అక్టోబర్ 22న ఆయన బెయిల్ పొందినా ఈడీ అరెస్ట్ కారణంగా తీహార్ జైలులోనే అప్పటి నుంచి ఉండిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఇవే కేసుల్లో ఆయన కుమారుడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. తీహార్ జైలులో కొద్ది రోజులున్న అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కార్తీ కూడా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని అప్పట్లో కోర్టు షరతులతోనే బెయిల్ ఇచ్చింది.