ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
ముస్లిం వివాహిత మహిళలకు రక్షణ
కవచంగా నిలిచే ట్రిపుల్ తలాఖ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ లో
ప్రవేశపెట్టనుంది. గత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఫిబ్రవరిలో ఆర్డినెన్స్
ను జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల
సందర్భంగా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం (జూన్12)
తెలిపారు. ఈ నెల 17 సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ
బిల్లుకు సవరణలు కోరుతూ గతంలో రాజ్య సభలో ప్రతిపక్షాలు అడ్డు తగలడంతో తాత్కాలికంగా
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను
జారీ చేయాల్సి వచ్చింది. ముమ్మార్లు తలాఖ్ (తలాఖ్-ఈ-బిద్దత్) చెప్పి ఓ
వివాహిత ముస్లిం మహిళకు భర్త విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ప్రభుత్వం దేశంలో అత్యవసరంగా
ఈ ఆర్డినెన్స్ ను తెచ్చింది. ఆ విధంగా ఎవరైనా ముమ్మార్లు తలాఖ్ చెప్పి
విడాకులిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 29 ఆగస్ట్ 2018లో కేంద్ర కేబినెట్ ఆమోదం
పొందిన ట్రిపుల్ తలాఖ్ బిల్లును గత ఎన్డీయే ప్రభుత్వం అదే ఏడాది పార్లమెంట్
ముందుకు తెచ్చింది. ఆ ఏడాది డిసెంబర్ లో లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో
బిల్లుకు సంబంధించి కొన్ని అంశాల పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం తెల్పుతూ సవరణలు కోరాయి.
అప్పటి నుంచి పార్లమెంట్ ఆమోదం లభించక ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకం అంటూ కేంద్రం
తాజా ఆర్డినెన్స్ ను జారీ చేయాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ట్రిపుల్
తలాఖ్ చెప్పడం నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. కోర్టు విచారణ సమయంలో కూడా నిందితుడికి
బెయిల్ పొందే అవకాశం లేదు. పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ కూడా మంజూరు
కాదు. బాధిత భార్య వాదనను విన్న అనంతరమే న్యాయస్థానం నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చా
లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 17వ లోక్ సభ కొలువుదీరాక కేంద్రం ఈ
ట్రిపుల్ తలాఖ్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను 10 ఆర్డినెన్స్ లుగా జారీ
చేయదలచింది. అందులో ఒక ఆర్డినెన్స్ ప్రకారం పూర్తిగా ట్రిపుల్ తలాఖ్ పై నిషేధం
విధించనున్నారు. తాజా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయిన 45 రోజుల లోపు ఈ ట్రిపుల్
తలాఖ్ ఆర్డినెన్స్ (10) చట్టంగా అమలులోకి రానున్నాయి.