Wednesday, March 4, 2020

CM YS Jaganmohan Reddy survey warning to ministers and MLA`S over local body elections

జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత?
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచి గడవకనే గంపగుత్తగా ఓట్లేసిన జనంలో వై.ఎస్.ఆర్.సి.పి. పాలనపై వ్యతిరేకత పెల్లుబికుతోందా? ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) ప్రజల నాడిని పసిగట్టే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దమ్ముంటే తాజాగా ఎన్నికలు నిర్వహించి గెలవాలని సవాలు చేస్తోందా? ఈమేరకు సీఎం జగన్ కు ఇంటెలిజెన్స్ నివేదిక అందిందా?అందులో భాగంగానే ఇటీవల జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని హెచ్చరించారా? అదేం కాదు గానీ.. ప్రస్తుత వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో సీఎం ఈమేరకు పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేయడానికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాల్సిన బాధ్యత వారి భుజాల మీదే పెట్టారు. ఏ జిల్లాలో ఓటమి ఎదురయితే అక్కడ మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగానూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రీతిలో హెచ్చరించి టీఆర్ఎస్ శ్రేణుల్లో జాగురుకత తెచ్చారు. ఫలితాల్ని ఆశించిన మేర సంపూర్ణంగా సాధించారు. ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో వైఎస్ఆర్సీపీ కేడర్, లీడర్లలో చైతన్యాన్ని రగిలిస్తున్నారు. ఇదిలావుండగా స్థానిక ఎన్నికలు మొత్తం మూడింటిని ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి మార్చి 24న ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే విధంగా మార్చి 15న గ్రామ పంచాయతీలకు షెడ్యూల్ విడుదల చేసి మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలనేది సీఎం యోచన. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కార్ ఇప్పటికే పంపించింది. అందులో భాగంగానే జగన్ జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాల పైన దృష్టి పెట్టాలని సూచించారు. అటువంటి వాటిని సరిదిద్దాలని మంత్రులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తన దగ్గర సర్వే ఉందని ఈ సందర్భంగా జగన్ హెచ్చరించారు.
25 లక్షల `వైఎస్ఆర్ జగనన్న` ఇళ్ల పట్టాల పంపిణీ
ఉగాది నాడు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని రాష్ట్ర కేబినెట్ బుధవారం తీర్మానం చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్ హోదా ఇవ్వనున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఐదేళ్ల తర్వాత విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 16 వేల ఎకరాల భూమిని బయటివారి నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాని వెల్లడించారు.