Tuesday, April 23, 2019

india warned sri lanka of serial bomb threat hours before suicide attacks

భారత్ అప్రమత్తం చేసినా.. పెడచెవిన పెట్టిన శ్రీలంక


  •  బాంబు పేలుళ్లకు రెండు గంటల ముందే సమాచారం అందజేత

  •    ఘాతుకం తమ పనేనన్న ఐఎస్ఐఎస్


శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల పీడకల రోజులు గడుస్తున్నా ప్రపంచ దేశాల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా పొరుగుదేశమైన శ్రీలంకతో భారత్ కు చారిత్రక సాంస్కతిక సంబంధాలు ముడిపడి ఉన్నాయి. దారుణ మారణహోమానికి సంబంధించి భారత్ రోజుల ముందుగానే శ్రీలంకను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 4వ తేదీనే భారత్ నిఘా వర్గాలు సమాచారాన్ని శ్రీలంక అధికార వర్గాలకు అందజేశాయి. అలాగే ఏప్రిల్21న పేలుళ్లకు రెండు గంటల ముందు కూడా అక్కడ రక్షణ శాఖకు ఉప్పందించాయి. అయినా అప్రమత్తం కాకపోవడంతోనే శ్రీలంక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అవుననే శ్రీలంక అధికారిక వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ప్రభుత్వ వర్గాలు భారత్ హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడంపై క్షమాపణ వేడుకున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీలంక అధ్యక్ష భవనం, భారత విదేశాంగ శాఖ నోరు విప్పడం లేదు. ఆదివారం ఈస్టర్ సండే నాడు వేర్వేరు ప్రాంతాల్లోని చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎనిమిది శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలుళ్లు జరగ్గా మృతుల సంఖ్య 321కు పెరిగింది. ఇంకా వందలమంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని సిరియా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ ఇంకా లభ్యం కాలేదని సమాచారం.

twitter's user numbers are growing again reports surprising usage

ఆశ్చర్యకరంగా పెరిగిన ట్విటర్ ఖాతాదారులు

·         గత ఏడాదితో పోలిస్తే 18% పెరుగుదల
·         త్రైమాసిక ఆదాయం రూ.1,300 కోట్లు
సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఖాతాదారుల సంఖ్యలో పెంపుదల కనిపించింది. 2019 తొలి త్రైమాసికంలో ఆదాయం 18 శాతం పెంపును నమోదు చేసినట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) జాక్ డొర్సి తెలిపారు. ఆదాయం రూ.1300 కోట్లు చేకూరిందట. ఖాతాదారుల సంఖ్య 13.40 కోట్లకు పెరిగి మొత్తంగా 33 కోట్ల 30 లక్షలకు చేరింది. అడ్వర్టయిజ్ మెంట్ ల ఆదాయం గణనీయంగా పెరగడంతో మొత్తం ఆదాయం 18 శాతం పెంపుతో రూ.67కోట్ల90లక్షల మార్క్ ను అందుకుంది. అయితే కంపెనీ ఎనలిస్టుల అంచనా ప్రకారం ఆదాయం పెంపు నమోదు కాలేదని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక పెంపుదల రూ.77 కోట్ల నుంచి రూ.83 కోట్లు ఉండొచ్చని భావించారు. ట్విటర్ సంస్థను జాక్ డొర్సీ, నొహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్ లు 2006 మార్చి 21న అమెరికా కాలిఫోర్నియా (శాన్ ఫ్రాన్సిస్కో)లో ప్రారంభించారు. ఈ పదమూడేళ్లలో సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచం నలుమూలలా విస్తరించి ఖాతాదారుల మన్ననలు చూరగొంటోంది. రోజూ 10 కోట్ల మంది యూజర్లు 34 కోట్ల ట్విట్లను చేస్తున్నారు.

here he is now with a t20 ton ajinkya rahane slams his second ipl century


ఢిల్లీని గెలిపించిన శిఖర్, పంత్

·        రహానే సెంచరీ వృథా  ·        6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి

జైపూర్ లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పై ఢిల్లీ కేపిటల్స్(డీసీ) విజయం సాధించింది. టోర్నీలో నాల్గో అర్ధ సెంచరీ చేసిన శిఖర్ ధావన్(27 బంతుల్లో 54) కు రిషబ్ పంత్ (36 బంతుల్లో 78పరుగులు) తోడవడంతో తేలిగ్గా గెలుపునందుకుంది. తొలి వికెట్ కు ధావన్, పృథ్వీషాల జోడి 72 పరుగులు చేసింది. పంత్ 2x6, 6x4 సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం నాలుగు వికెట్లనే కోల్పోయిన డీసీ లక్ష్యం 192 పరుగుల్ని ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే సాధించింది. టాస్ గెలిచిన డీసీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ ఆర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్సీ బాధ్యతల తప్పడంతో బ్యాటర్ గా రహానే పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 11 బౌండరీలు 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్లో రెండో సెంచరీని సాధించాడు. కెప్టెన్ స్మిత్ అర్ధ సెంచరీతో రాణించాడు. రబాడ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ లోపాలు కూడా డీసీ సునాయాస విజయానికి దోహదం చేశాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ప్రస్తుతం డీసీ నెం.1 స్థానానికి చేరుకుంది.