Thursday, April 25, 2019

parag archer take rr to winning side ipl season 12


రాజస్థాన్ చేతిలో కోల్ కతా చిత్తు
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన ఐపీఎల్ సీజన్12 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పట్టుదలగా ఆడి విజయాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన ఆర్ ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోలకతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ దినేశ్ కార్తిక్ (50 బంతుల్లో 9x6, 7x4) మాత్రమే రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జట్టులో తర్వాత నితీశ్ రాణా (21) చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ ఆర్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలుపునందుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్.ఆర్. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టుకు ఇది నాల్గో విజయం. అజింక రహానే ఈ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఒక సిక్స్, అయిదు బౌండరీలతో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సంజు శ్యామ్ సన్ (22) అండగా నిలవడంతో 5.2 ఓవర్లలోనే ఓపెనర్లు 53 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశారు. రహానే అవుటయ్యాక 63 పరుగుల వద్ద శ్యామ్ సన్ వికెట్ ను జట్టు వెంటనే కోల్పోయింది. గెలుపు దోబూచులాడిన సమయంలో అయిదో బ్యాట్స్ మన్ గా వచ్చిన రియాన్ పరాగ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. విలువైన 47 పరుగులు చేసిన పరాగ్ 19 ఓవర్లో రస్సెల్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే ఆ ఓవర్లో సిక్సర్ సాధించడంతో ఆర్.ఆర్. జట్టు సురక్షితమైన స్థానంలోకి వచ్చింది. చివర్లో ఆర్చర్ (27) మురిపించాడు. ప్రదీప్ కృష్ణ బౌలింగ్ లో వరుసగా బౌండరీ, సిక్సర్ సాధించి కావాల్సిన 9 పరుగుల్ని రెండు బంతుల్లోనే సాధించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. కేకేఆర్ జట్టుకు ఇది ఏడో ఓటమి.

No comments:

Post a Comment