Monday, August 26, 2019

Alongside Trump, PM Modi rejects any scope for third party mediation on Kashmir


మోదీపై జోక్ పేల్చిన ట్రంప్
భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరదాగా ఆటపట్టించారు. ఫ్రాన్స్ పట్టణం బియర్రిట్జ్ లో జరుగుతున్న జి-7 సమావేశాలకు హాజరైన సందర్భంగా మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ జోక్ పేల్చారు. మోదీ ఇంగ్లిష్ చక్కగా మాట్లాడతారు.. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో మాట్లాడరంటూ ట్రంప్ చమత్కరించారు. అందుకు మోదీ పెద్దగా నవ్వేస్తూ తన చేతుల్లోకి ట్రంప్ చేయిని తీసుకుని చరిచారు. దాంతో అక్కడున్న వారందరిలో నవ్వులు విరబూశాయి.
కశ్మీర్ సమస్యపై మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టం
దీర్ఘకాల అపరిష్కృత సమస్యగా ఉన్న కశ్మీర్ వ్యవహారాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని ట్రంప్ తో భేటీ సందర్భంగా మోదీ తేల్చిచెప్పారు. ఈ సమస్య పరిష్కారంలో మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టబోమన్నారు.  ట్రంప్ తో కలిసి మోదీ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ను కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ పాతపాటే పాడారు. అందుకు బదులుగా ట్రంప్ కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. స్పందించిన అమెరికా కాంగ్రెస్ భారత్, పాక్ ల ద్వైపాక్షిక చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాలని వివాదం రేగకుండా సముచిత ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో మోదీ కశ్మీర్ సమస్యపై మూడో దేశం జోక్యం అవసరం లేదని నర్మగర్భంగా చెప్పారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం పాక్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి యత్నించి భంగపడింది. ఆ క్రమంలో అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి మరీ పాక్ ప్రధాని నానాయాగి చేశారు. దాంతో మోదీ సైతం ఇటీవల ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి కశ్మీర్ భారత అంతర్భాగమని అందులో తాము దేశీయంగా చేపట్టిన చర్యల్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన ట్రంప్ వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసి భారత్ ను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. తాజా భేటీలో ట్రంప్ తో మోదీ మాట్లాడుతూ పాక్ ప్రధానితో కొంతకాలం క్రితం టెలిఫోన్ లో తను సంభాషించినట్లు తెలిపారు. పాక్ లో సమస్యల్ని ఇమ్రాన్ తనతో ఏకరువు పెట్టారన్నారు. ఆ దేశంలోని ప్రజల బాగోగులకు సంబంధించి కూడా భారత్ చేయూత అందిస్తుందని ఇమ్రాన్ కు చెప్పినట్లు మోదీ తెలిపారు.