బెంగళూరు, కర్ణాటక వెళ్లాలనుకునే వారికి కచ్చితంగా ఇది శుభవార్తే. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ముఖ్యంగా బెంగళూరు రావాలనుకునే ప్రయాణికులకు కోవిడ్ ఆంక్షలను సర్కారు సులభతరం చేసింది. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం యడ్యూరప్ప ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల అంతర్రాష్ట సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు వచ్చేవారిలో కరోనా లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండి `ఆప్తమిత్ర` హెల్త్ లైన్ నంబర్ 14410కి ఫోన్ చేసి చికిత్స పొందొచ్చు. అదేమాదిరిగా ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు `సేవా సింధు` పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి వచ్చేది. ఇక ఆ నిబంధన ఉండదు. అంతేకాదు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి కరోనా టెస్టులు చేయరు. క్వారంటైన్ నిబంధన కూడా ఉపసంహరించారు. కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించడంతో పాటు వైద్యం పొందాల్సి ఉంటుంది. మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని ప్రభుత్వం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయి.