Sunday, April 21, 2019

msdhoni career best in vain rcb beat csk in thriller ipl-12


ఆఖరి బంతికి ఆర్ సీ బీ విజయం


§ శివమెత్తిన ధోని..చివరి ఓవర్లో 24పరుగులు చేసినా తప్పని ఓటమి


   బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మరోసారి ఉత్కంఠ పోరుకు వేదికయింది. ఆదివారం ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ లో అజేయంగా దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్ కే)ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీ బీ) ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఆర్ సీబీకి వరుసగా ఇది రెండో విజయం. టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో ఆర్ సీబీ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ 7 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 37 బంతుల్లో అర్థ సెంచరీ 53 సాధించాడు. ఏబీ డివిలియర్స్(25), అక్షదీప్ నాథ్(24), మొయిన్ అలీ(26) రాణించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్ కే వికెట్లు టపటపా పడిపోయాయి. 6-1, 6-2,17-3, 28-4 ఈ సంఖ్యలను చూస్తేనే డగ్ ఔట్ కు చేరాలనే సీఎస్ కే బ్యాటర్ల తొందర తెలుస్తుంది. డుప్లెసిస్, కేదార్ జాదవ్ లు అవుటయ్యారనే కంటే వికెట్లను పారేసుకున్నారంటే సబబుగా ఉంటుంది. క్రీజ్ లో ఉన్న రాయుడుతో ధోని జత కలిశాకే చెన్నై ఇన్నింగ్స్ కుదురుకుంది. అంతకు మించి బెంగళూరు సీమర్లు లైన్ అండ్ లెంగ్త్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్ మన్ ను కట్టిపడేశారు. చక్కగా ఆడుతున్న రాయుడు(29) పెవిలియన్ కు చేరినా మ్యాచ్ ఫినిషర్ ధోని ఉండడంతో సీఎస్ కే ఆశలు సజీవంగా ఉన్నాయి. చివర్లో బ్రావో(5) కెప్టెన్ ధోనికి జత కలిశాడు. ఆఖరి 6 బంతుల్లో 26 పరుగులు చేయాలి. ధోని స్ట్రైకింగ్ లో ఉన్నాడు. తొలి బంతినే బౌండరీకి తరలించిన ధోని తర్వాత మూడు సిక్సర్లూ బాదాడు. ఒక సిక్సరయితే బంతి స్టేడియం బయటకు వెళ్లిపోయింది. చివరి బంతికి రెండు పరుగులు లేదా ఒక్కపరుగు చేస్తే సూపర్ ఓవర్.. ఉమేశ్ స్లో బాల్ వేయడంతో బైస్ రన్ కోసం ధోని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు. శార్దుల్ ను ఆర్ సీ బీ వికెట్ కీపర్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేశాడు. దాంతో బెంగళూరు విజయదరహాసం చేసింది. స్కిపర్ ధోని 84 (48 బంతుల్లో 7x6, 5x4) నాటౌట్ గా నిలిచాడు. చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేయగల్గింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ కు అవకాశాన్ని నిలుపుకుంది.

No comments:

Post a Comment