Tuesday, October 27, 2020

Unlock guidelines issued in September to remain in force till November 30: MHA

నవంబర్ 30 వరకు అన్ లాక్-5 నిబంధనలే 

అన్ లాక్-5 నిబంధనలే నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా జూన్ 1 నుంచి దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ లాక్-5 నిబంధల్ని నవంబర్ ముగిసేవరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ తీసేయడం అంటే కరోనా పోయినట్లు భావించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు దాని విషయంలో అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. గత నెల అన్ లాక్-5 సడలింపులను ప్రకటించిన కేంద్రం అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని షరతు పెట్టింది.