Wednesday, July 17, 2019

ICJ asks Pakistan to hold death sentence of kulbhushan jadhav, calls for fair trial


కులభూషణ్ జాదవ్ ఉరి నిలిపివేయాలని పాకిస్థాన్ కు ఐసీజే ఆదేశం
పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాదవ్ కు ఆ దేశ న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు విధించిన ఉరిశిక్షను నిలిపివేసి నిష్పక్షపాత న్యాయవిచారణ చేపట్టాలని పాకిస్థాన్ కు సూచించింది. ఐసీజేలో 15:1 నిష్పత్తిలో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) విభాగమైన ఐసీజే 1945లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ఏర్పాటయింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని హేగ్ లో అంతర్జాతీయ న్యాయ విచారణలు నిర్వహిస్తోంది. 
 తమ దేశంలో గూఢచర్యం నిర్వహించి కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలతో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆయనను నిర్బంధించింది. వాస్తవానికి ఆయనను ఇరాన్ లో నిర్బంధించిన పాకిస్థాన్ నిఘా అధికారులు తమ దేశానికి తరలించారని భారత్ వాదిస్తోంది. 2003 నుంచి 2016 వరకు నేవీ కమాండర్ గా విధులు నిర్వర్తించిన కులభూషణ్ పదవీ విరమణ చేశారు. ఆయన వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 10 ఏప్రిల్ 2017న ఇరాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ పట్టుకుని పాకిస్థాన్ కు అపహరించుకు వెళ్లారు. కులభూషణ్ భారత రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ తరఫున తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. భారత్ ఐసీజే దృష్టికి తీసుకెళ్లడంతో పాక్ న్యాయస్థానం తీర్పునకు అడ్డుకట్టపడింది. సుదీర్ఘ విచారణల అనంతరం  ఐసీజే నిష్పాక్షపాత, సమగ్ర విచారణ చేపట్టాలని పాక్ ఉన్నత న్యాయస్థానానికి సూచిస్తూ విధించిన ఉరిశిక్ష తీర్పును సస్పెండ్ చేసింది. 1970 లో మహారాష్ట్రలోని సాంగ్లిలో సుధీర్ జాదవ్, అవంతి జాదవ్ లకు కులభూషణ్ జన్మించారు. కులభూషణ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ న్యాయస్థానం విధించిన తీర్పుపై ఐసీజే వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు భారత్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ కేసు విషయంలో పాక్ కు అమెరికా, చైనాలు మద్దతు ఇవ్వడం గమనార్హం.