Thursday, August 29, 2019

One of the stalwarts of people's telugu movement Gidugu Rama Murthy


అచ్చతెలుగు దివ్య వెలుగు గిడుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. తెలుగు మాతృభాషగా మాట్లాడే వారు సుమారు 11 కోట్ల మంది. దేశంలో ప్రాంతీయ భాషలలో మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు వారు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగుది 15వ స్థానం. దేశంలో హిందీ తర్వాత స్థానంలో తెలుగు నిలుస్తోంది. `ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` గా కీర్తి పొందింది. `దేశ భాషలందు తెలుగు లెస్స` అని శ్రీకృష్ణదేవరాయలతో ప్రశంసలు అందుకుంది. అటువంటి తెలుగును సామాన్య జనం వాడుక భాష లో అందరి దరికి చేర్చిన మహానుభావుల్లో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ఆద్యులు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడాయన. గిడుగు వాడుక భాషా ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు తర్వాత  అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29 ని `తెలుగు భాషా దినోత్సవం` గా జరుపుకుంటున్నాం.
గిడుగు రామ్మూర్తి పంతులు 1863 లో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వీర్రాజు విష జ్వరంతో మరణించారు. ప్రాథమిక విద్య అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు విజయనగరంలోని మేనమామ గారి ఇంటికి చేరి హైస్కూలు చదువు పూర్తి చేశారు. ఆయనకు 10వ తరగతిలో గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి. అనంతరం పర్లాకిమిడి రాజా వారి పాఠశాల్లో 8వ తరగతి చరిత్ర ఉపాధ్యాయుడిగా గిడుగు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ప్రయివేటుగా బి.ఎ. చేశారు. డిగ్రీలో చరిత్రను ముఖ్య పాఠ్యాంశంగా ఎంచుకున్న ఆయన రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించారు.
చదువంటే ఎనలేని మమకారం గల గిడుగు బహుభాషా కోవిధుడు. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతంతో పాటు సవర భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు. సవరలు వారి భాషలోనే చదువుకొనేలా ప్రోత్సహించారు. సొంతంగా పాఠశాల ప్రారంభించి ఉపాధ్యాయుల్ని నియమించి వారికి జీతాలు ఇస్తూ సవరలకు చదువు నేర్పారు. వారిని తన ఇంట్లోనే పెట్టుకుని భోజనం పెడుతూ చదువు చెప్పించారు. స్వయంగా ఆయన సవర భాషలో పుస్తకాలు రాశారు. సవర-ఇంగ్లీషు డిక్షనరీ రూపొందించారు. మద్రాస్ ప్రభుత్వం గిడుగు కృషిని గుర్తించి `రావుబహుదూర్` బిరుదుతో పాటు, కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. ఆనాడే సవరలు, హరిజనులు అంటరాని వారు కాదని వారితో మమేకం అయిన ధీశాలి.
1907లో  ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా ఇంగ్లీషు దొర యేట్సు వచ్చారు. ప్రజలు మాట్లాడే భాష, పాఠ్య పుస్తకాల భాష మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయని యేట్సుకు సందేహం వచ్చింది. ఆ విధంగా వాడుక భాష ఉద్యమం గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుల ద్వారా ప్రారంభమైంది. జనం మాట్లాడే తెలుగు భాషను గ్రంథ రచనకు అనువుగా చేయడానికి ఎనలేని కృషి చేసిన గిడుగుకు వీరేశలింగం పంతులు ఊతం కూడా లభించింది. 1919లో వాడుక భాషా ఉద్యమ ప్రచారం కోసం 'తెలుగు' అనే మాసపత్రిక నడిపారు. వ్యాసాలు, ఉపన్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. స్కూలు, కాలేజీ పుస్తకాల్లోని  గ్రాంథికభాషను క్రమంగా వాడుకభాషలోకి తేవడానికి గిడుగు సాగించిన కృషి ఫలించింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వాడుక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. తాపీ ధర్మారావు సంపాదకుడిగా ప్రారంభమైన `జనవాణి` అనే పత్రిక వాడుక భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. వాడుక భాష లో విద్య బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందని గిడుగు నిరూపించారు. జనం మాట్లాడే భాష అంతటా వినబడుతూ ఉంటుంది. అదే నిత్య జీవంతో కళకళలాడుతుందని లోకానికి చాటి చెప్పిన మహనీయులు గిడుగు రామ్మూర్తి.  ఆయన 1940 జనవరి 22న రాజమండ్రిలో మరణించారు.