Thursday, July 4, 2019

Westindies beat Afghanistan by 23 runs in icc world cup


నామమాత్రపు మ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై వెస్టిండీస్ గెలుపు
ఐసీసీ వరల్డ్ కప్-12లో అఫ్గనిస్థాన్ పరాజయాలు పరిపూర్ణమయ్యాయి. ఆడిన తొమ్మిదింటికి  9 మ్యాచ్ ల్లో పరాజయం పాలయినా ఆ జట్టు చివరి మ్యాచ్ లోనూ వెస్టిండీస్ పై పోరాట పటిమను ప్రదర్శించింది. హెడ్డింగ్లే లీడ్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్ నం.42లో అఫ్గన్ల పోరాటం మరోసారి అబ్బురపరిచింది. అయినా బలమైన జట్టు వెస్టిండీస్ ఆ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే ఇరు జట్లు నాకౌట్ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో కరేబియన్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి పేలవమైన ఫామ్ తో 7 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇవిన్ లూయిస్(58), కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్(77) రెండో వికెట్ కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మర్(39), నికోలస్ పూరన్(58), కెప్టెన్ హోల్డర్(45) రాణించడంతో విండీస్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అఫ్గన్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చారు. అందరికంటే ఎక్కువగా దవ్లాత్ జద్రాన్ 73 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ షిర్జాద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో 1 వికెట్ తీశారు. 
అనంతరం 312 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్గనిస్థాన్ మరోసారి తను బలమైన జట్టుగా ఎదుగుతున్న తీరును ప్రపంచ క్రికెట్ ముందు ప్రదర్శించింది. ఓ దశలో గెలుపు అవకాశాలు కనిపించాయి. కెప్టెన్ గుల్బుద్దీన్(5) మరోసారి సింగిల్ డిజిట్ కే డగౌట్ చేరాడు. మరో ఓపెనర్ రహ్మత్ షా(62), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్(86) రెండో వికెట్ కు 133 పరుగులు జోడించి జట్టు గెలుపుపై ఆశలు కల్పించారు. ఆ తర్వాత జద్రాన్(31), అస్ఘర్ అఫ్గన్(40), సయ్యద్ షిర్జాద్(25) మాత్రమే విండీస్ బౌలర్లను ఎదుర్కొని చెప్పుకోదగ్గ పరుగులు చేయగలిగారు. 288 పరుగులకు అఫ్గనిస్థాన్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాథ్ వెయిట్ 4, కెమర్ రోచ్ 3 వికెట్లు పడగొట్టగా ఒషానే థామస్, క్రిస్ గేల్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను హోప్ గెలుచుకున్నాడు.

Loksabha passes aadhaar bill:it use is vital but voluntary,sats govt.


లోక్ సభలో ఆధార్ సవరణల బిల్లు ఆమోదం
భారత పార్లమెంట్ దిగువ సభ గురువారం సవరణలతో కూడిన ఆధార్ బిల్లు-2019ను ఆమోదించింది. కేంద్ర న్యాయ, సాంకేతిక సమాచార శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెల్పింది. ఆధార్ కార్డు చాలా కీలకమని అయితే వ్యక్తులు స్వచ్ఛందంగా వినియోగించే వీలు కల్పిస్తూ ఈ బిల్లును తాజాగా ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం, ప్రజల్లో పారదర్శకత చాలా పెరిగిందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అక్రమాలకు ఈ కార్డు చరమగీతం పాడిందన్నారు. 4.23 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లు, 2.98 కోట్ల అక్రమ రేషన్ కార్డులు తొలగించడం సాధ్యమైందన్నారు. ఆయా లబ్ధికారక పథకాల్లో కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమాల పాలవ్వకుండా ఆధార్ ద్వారా అడ్డుకట్ట పడిందన్నారు. తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదా అయినట్లు రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం వ్యక్తులు తమ ఇష్ట ప్రకారం బ్యాంక్ ఖాతాలు, ఫోన్ సిమ్ కార్డుల కోసం ఆధార్ ను వినియోగించుకోవచ్చు. వ్యక్తుల ఆధార్ వివరాల్ని ఏ సంస్థలు స్టోర్ చేయకూడదు. ఆ విధంగా ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా విధిస్తారు. ఆధార్ బయోమోట్రిక్ దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదని మంత్రి చెప్పారు. కంటి పాప(ఐరిస్), వేలిముద్రలు(ఫింగర్ ప్రింట్స్), ఇతర వ్యక్తిగత వివరాలు(పర్సనల్ డేటా) భారత ప్రభుత్వ ఆధీనంలోని యంత్రాంగంలోనే అత్యంత భద్రంగా సురక్షితంగా స్టోర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 123 కోట్ల మంది ఆధార్ కార్డును కల్గి ఉన్నారని వారు ఆయా అవసరాల నిమిత్తం ఆధార్ ను వినియోగించుకుంటున్నారని రవి శంకర్ వివరించారు.