బిహార్ సీఎంగా నితీశ్ నాల్గోసారి
బిహార్ ముఖ్యమంత్రిగా జెేడీ (యు) చీఫ్ నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు ఎన్డీయే కూటమిలోని పార్టీల నాయకులు కూడా కేబినెట్ మంత్రులుగా పదవులు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వి.ఐ.పి) కు చెందిన ముఖేష్ సాహ్ని, జేడీ (యు) విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలౌచౌదరి తదితరులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. 2005 నుంచి గరిష్ఠ కాలం బిహార్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)కి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయనకు సెంట్రల్ బెర్త్ దక్కవచ్చని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజరుకాలేదు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది.