Sunday, January 26, 2020

ITBP Celebrate 71st Republic Day by Hoisting National Flag at 17,000 Feet in Ladakh

హిమగిరులపై మువ్వన్నెల జెండా రెపరెపలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ.టి.బి.పి.) సిబ్బంది 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐటీబీపీ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకు వెళ్లి ఎగురవేశారు. సైనికులు 'భారత్ మాతా కి జై', 'వందే మాతరం' అంటూ నినాదాలు చేశారు. జెండాను ఎగురవేసే సమయంలో లడఖ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. అతిశీతల వాతావరణంలో దేశానికి అచంచల సేవలందిస్తున్న ఈ ఐటీబీపీ సైనికులను 'హిమ్వీర్స్' (హిమాలయాల ధైర్య సైనికులు) అని కూడా పిలుస్తారు. 1962 చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీ ఏర్పడింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) చట్టం ప్రకారం 1962 అక్టోబర్ 24 న నెలకొల్పిన ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఐటీబీపీ ఒకటి. నాటి నుంచి హిమగిరులపై ఈ దళం భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, విధులను నిర్దేశిస్తూ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. 1929 లో ఇదే రోజున భారత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.