Sunday, October 13, 2019

India, Japan to hold joint military exercise from Oct 19


19 నుంచి భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు
ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసాల్లో భారత జపాన్ లు సంయుక్తంగా పాల్గొననున్నాయి. ఈనెల 19 నుంచి నవంబర్ 2 వరకు ఉభయదేశాలకు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మ-గార్డియన్ (ధర్మ సంరక్షణ) పేరిట ఈ సైనిక విన్యాసాల్ని మిజోరంలోని వైరెంగ్టేలో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేజీఎస్డీఎఫ్) లకు చెందిన 25 మంది చొప్పున సైనికులు పాల్గొనబోతున్నారు.  ఆయా దేశాలలో వివిధ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాన్ని ఉభయ దేశాల సైనికులు ఈ సందర్భంగా పంచుకోనున్నారు. ప్రపంచ ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాలు భద్రతా సవాళ్ల ను అధిగమించేందుకు ఏర్పాటవుతున్న ఈ విన్యాసాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో తలెత్తుతోన్న ఉగ్రవాదం.. నిరోధక చర్యలపై ప్లాటూన్ స్థాయి లో సైనికులు ఉమ్మడి శిక్షణ పొందనున్నారు. వివిధ దేశాలతో భారతదేశం చేపట్టిన సైనిక విన్యాసాల శిక్షణ క్రమంలో తాజా కార్యక్రమం  కీలకమైనదని అధికారిక ప్రకటన పేర్కొంది.