Thursday, September 19, 2019

NDRF set to induct women personnel


వచ్చే ఏడాది నాటికి ఎన్డీఆర్ఎఫ్ లోకి మహిళలు
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) లోకి మహిళల ప్రవేశం షురూ కానుంది. వచ్చే ఏడాది నాటికి కొత్తగా ఏర్పాటుకానున్న నాలుగు బెటాలియన్లలో మహిళల్ని చేర్చుకోనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఐపీఎస్ ఎస్.ఎన్.ప్రధాన్ ప్రకటించారు. 2018 నుంచి మహిళా సభ్యుల్ని చేర్చుకోవాలనే యోచన ఊపందుకుందన్నారు. పశ్చిమబెంగాల్ లోని హరింఘాటలో గల ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్ లో రెండో బెటాలియన్ ను ప్రధాన్ ఇటీవల ప్రారంభించారు. ప్రధానంగా సౌకర్యాల లేమీ వల్లే గతంలో మహిళా సిబ్బందిని చేర్చుకోలేకపోయామన్నారు. కొన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అన్ని మౌలికసదుపాయాల్ని కల్పించగల స్థితిలోకి వచ్చిందని అందుకే ఇప్పుడున్న 12 బెటాలియన్లకు అదనంగా మరో నాలుగు కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఈ కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కొత్త బెటాలియన్లకు మహిళా సిబ్బందిని పంపాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఇతర సాయుధ దళాల్ని ఎన్డీఆర్ఎఫ్ కోరుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఒక్కో బెటాలియన్ లో 1,150 మంది సిబ్బంది ఉంటారు. కొత్త సిబ్బందిని చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వం అసోం రైఫిల్స్, ది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటుకు 2005లో బీజం పడింది. ఇందుకుగాను ప్రకృతి విపత్తుల నిరోధక కార్యనిర్వహణ చట్టం చేశారు. 2006లో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటయింది. బాధితుల సంరక్షణ, వెన్నుదన్నుగా నిలవడం అనే ప్రధాన ధ్యేయంతో ఎన్డీఆర్ఎఫ్ పని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు, భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి ఇతోధిక సేవలందిస్తోంది.