చైనా దుబాయ్ లకు ఏనుగుల్ని విక్రయించిన
జింబాబ్వే
మా దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది.. వాటిని కాపాడుతూ పోషించే
శక్తి మాకు లేదు.. అమ్మేస్తాం.. కొంటారా.. అంటోంది ఆఫ్రికా దేశం జింబాబ్వే. అందుకు
తగ్గట్లు గానే ఆరేళ్లలో వంద లోపు ఏనుగుల్ని ఆ దేశం విక్రయాల ద్వారా వదిలించుకుంది.
ఇటీవల లెక్కల ప్రకారం ఏనుగుల విక్రయం ద్వారా రూ.14 కోట్ల 55 లక్షలు(2.7మిలియన్
డాలర్లు) ఆర్జించింది. 2012 నుంచి ఇప్పటి వరకు చైనా, దుబాయ్ లకు జింబాబ్వే 97
ఏనుగుల్ని విక్రయించింది. ఇందులో చైనాకు అత్యధికంగా 93 ఏనుగుల్ని, దుబాయ్ కి
నాలుగు ఏనుగుల్ని అమ్మేసింది. ఈ విషయన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ప్రిస్కా
ముఫ్మిర వార్తా సంస్థలకు తెలిపారు. విక్రయించిన ఏనుగులన్నీ రెండు మూడేళ్ల లోపువేనన్నారు.
తమ అభరణ్యాలు, ఇతర పార్కుల్లో 55 వేల ఏనుగుల్ని మాత్రమే సంరక్షించగలమని అయితే
ప్రస్తుతం జింబాబ్వేలో 85 వేల ఏనుగులున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో ఏనుగును కనీసం
రూ.9లక్షల నుంచి రూ.29లక్షలకు ($13,500- $41,500) విక్రయించామన్నారు.
ముఖ్యంగా వేటగాళ్ల బారి నుంచి ఏనుగుల్ని రక్షించడం కూడా ఆఫ్రికా దేశాలకు
ఇబ్బందిగానే పరిణమించింది. వాటిని సంరక్షించేందుకు అయ్యే ఖర్చును ఆ దేశాలు భరించే
స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలకు వాటిని విక్రయించడమే మార్గమని భావిస్తున్నాయి.
బోట్స్వానా రాజధాని కసానే లో ఇటీవల జరిగిన ఎలిఫాంట్ సమ్మిట్ సందర్భంగా బోట్స్వానా,
జాంబియా, నమిబియా, జింబాబ్వే దేశాల నేతలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ
విక్రయాల్లో ప్రస్తుతం జింబాబ్వే ముందు వరుసలో ఉంది.