శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందంజలో
కొనసాగుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం ఆయన
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సముదాయం నుంచి బయటకు
వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన చౌహాన్ దేశం ప్రస్తుతం ఒక కఠినమైన దశను
దాటుతోందని పేర్కొన్నారు. ఒక వైపు కోవిడ్-19 మహమ్మారిపై
పోరాటం, మరోపక్క సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోంటోందని
చెప్పారు. సరిహద్దుల వద్ద గల మన వీర జవాన్లు చైనాకు తగిన సమాధానం ఇచ్చారన్నారు. మన
సరిహద్దులను సురక్షితంగా కాపాడుకోవడం, అదే సమయంలో దేశ
ప్రజలకు కరోనా మహమ్మారి బారి నుంచి విముక్తి కల్పించడం ప్రధానమైన సవాళ్లుగా
అభివర్ణించారు. కలియుగ దైవమైన శ్రీవారిని తను ఈ విపత్కర తరుణం నుంచి దేశాన్ని
రక్షించాలని ప్రార్థించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు
చేపట్టిన చౌహాన్ గడిచిన రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆయన
శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో
పాల్గొన్నారు. శుక్రవారం ఆయన చినజియర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే
బస చేసిన చౌహాన్ ఈరోజు తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.