Wednesday, October 23, 2019

39 bodies found in truck container in London


లండన్ సరకు రవాణా లారీలో గుట్టలుగా శవాలు
ఒళ్లు గగుర్పొడిచే ఘటన బుధవారం లండన్ లో చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ సరకు రవాణా లారీ(కంటైనర్)లో 39 శవాల్ని పోలీసులు కనుగొనడంతో కలకలం రేగింది. లండన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 1.40కి గ్రేస్ లోని వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో ఈ శవాల లారీని గుర్తించారు. బల్గేరియా రిజిస్ట్రేషన్ కల్గిన ఈ భారీ లారీ జీబ్రుగే నుంచి బయలుదేరి థేమ్స్ నదీ పరీవాహక ప్రాంత పట్టణం తుర్రాక్ చేరుకుంది. అక్కడ 35 నిమిషాల సేపు ఆగిన లారీ మళ్లీ నగరం దిశగా ప్రయాణించినట్లు ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. లారీలో భారీ రిఫ్రిజిరేటర్ ను గుర్తించారు. అందులో పెద్ద సంఖ్యలో భయానకంగా ఉన్న శవాల్ని కనుగొన్నారు. ఇందులో 38 మంది వయోజనుల మృతదేహాలతోపాటు ఓ బాలుడి శవం బయటపడింది. వీరంతా దారుణ హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. లారీలో గల ఫ్రిజ్ -25 డిగ్రీల సెల్సియస్ స్థితిలో ఉంది. అందులో ఈ హతుల శవాలను ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల ఈ లారీ డ్రైవర్ ఉత్తర ఐర్లాండ్ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. అతణ్ని అరెస్ట్ చేశారు. హతులంతా బల్గేరియా వాసులని భావిస్తున్నారు. లోహంతో తయారైన గాలిచొరబడని లారీలో  తొలుత ఈ 39 మందిని ఉంచి లాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఫ్రిజ్ లో కుక్కిఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం హతుల వివరాలను వెలికితీయడమేనని ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. ఈ లారీకి సంబంధించిన ఏ విషయమైనా తమకు తెలపాలని ప్రత్యక్షసాక్షులకు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మారినన్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇది `అనూహ్యమైన విషాదం.. నిజంగా హృదయ విదారకం`అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. కేసును ప్రత్యేక నేరపరిశోధన విభాగం దర్యాప్తు చేస్తోంది.