Friday, May 24, 2019

India bans Jamaat-ul-Mujahideen Bangladesh terror outfit



జమాత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థపై భారత్ నిషేధాస్త్రం
బంగ్లాదేశ్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే జమాత్ ఉల్ ముజాహిద్దీన్(జె.ఎం.బి) సంస్థను భారత ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశంలోని బుర్ద్వాన్, గయాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో ఈ ఉగ్ర సంస్థ కు చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉందనే అనుమానంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఎంబీ తన కార్యకలాపాల్ని భారత ఉపఖండం మొత్తం విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. కేంద్ర హోంశాఖ గురువారం (మే23) జె.ఎం.బి.ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జిహాద్ నినాదంతోపాటు ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ సంస్థ 1998 నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి గ్రూపులోకి చేర్చుకుని వారికి ఉగ్రవాద కార్యకలాపాల శిక్షణ ఇస్తోంది. భారత్ లో ఈ సంస్థ తమ కార్యకలాపాల్ని విస్తరించే పనిలో నిమగ్నమైనట్లు అనుమానిస్తున్నారు. 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ లో, 2018 జనవరిలో బుద్ధ గయలో పేలుళ్లకు పాల్పడిన వారిలో ఈ జె.ఎం.బి. ఉగ్రవాదులున్నట్లు భావిస్తున్నారు. అసోం పోలీసులు అయిదు కేసుల్లో జె.ఎం.బి. పాత్రను నిర్ధారించారు. ఈ గ్రూపునకు చెందిన 56 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో పశ్చిమబెంగాల్, అసోం, త్రిపుర, బంగ్లా-భారత్ సరిహద్దుల్లోని 10 కి.మీ. పరిధిలో ఉగ్ర కార్యకలాపాలకు జె.ఎం.బి. రచించిన ప్రణాళికలు వెల్లడికావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.  

PM Narendra Modi, Amit Shah meet Advani, Murli Manohar Joshi



అద్వానీ జోషీలను కలిసిన ప్రధాని మోదీ
తాజా లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అనూహ్య విజయాన్ని అందుకున్న ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక, కురువృద్ధులైన నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడగా ఒక రోజు వ్యవధిలోనే బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా వెంట రాగా మోదీ శుక్రవారం(మే24) తన గురువు అద్వానీ, జోషిలను వారి నివాసాలకు వెళ్లి కలుసుకుని విజయానందాన్ని పంచుకున్నారు. ఈ రోజు బీజేపీ విజయం సాధించిందంటే అద్వానీజీ దశాబ్దాలుగా పార్టీ నిర్మాణానికి వేసిన పునాదులు, సాగించిన కృషి ఫలితమేనని, తాజా ఆలోచనా విధానాన్ని ఆయన ప్రజల వద్దకు చేర్చారంటూ ట్వటర్ లో మోదీ పేర్కొన్నారు. జోషి గురించి ట్వీట్ చేస్తూ మోదీ..ఆయన గొప్ప విద్యావంతుడు, మేధావి.. భారతీయ విద్యా విధానంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. అహరహం బీజేపీ పటిష్టతకు కృషి చేశారు..తనతోపాటు పలువురు కార్యకర్తల్ని ఆయన తీర్చిదిద్దారని ప్రశంసించారు.