Thursday, May 9, 2019

indian christian serves iftar to nearly 800 muslim workers

యూఏఈలో ఇఫ్తార్ విందు ఇచ్చిన భారతీయ క్రైస్తవ వ్యాపారవేత్త


యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో వ్యాపారం నిర్వహిస్తున్న భారతీయ క్రిస్టియన్ సాజి చెరియన్(49) రంజాన్ సందర్భంగా సంస్థలోని సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 7 బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేరళలోని కాయంకుళంకు చెందిన సాజి గత ఏడాది ఇక్కడ సుమారు రూ.కోటి 96 లక్షలతో (1.3 మిలియన్ దిర్హామ్) మసీదు నిర్మించారు. తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేలు(800 దిర్హామ్లు) సంపాదిస్తారు. వారు ప్రతి రంజాన్ మాసంలో సమీపంలోని మసీదులకు టాక్సీల్లో రోజూ ప్రార్థనలకు వెళ్లి రావడానికి రూ.380(20  దిర్హామ్లు) ఖర్చు చేస్తుండడాన్ని గమనించిన ఆయన వారికి ఆ ఖర్చులు లేకుండా చేయాలని మసీదు నిర్మించారని తెలుస్తోంది. 2003లో యూఏఈ(దుబాయ్) చేరిన సాజి సొంతంగా వ్యాపారవేత్తగా ఎదిగారు. తమ సంస్థలో పనిచేసే సిబ్బందికి ఉచిత నివాస సదుపాయాన్ని కల్పించారు. ఫుజర్హాలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందులో సంస్థలో పనిచేసే 800 మంది సిబ్బందితో పాటు సమీప కంపెనీలకు చెందిన సీనియర్ ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు. గత ఏడాది రంజాన్ సందర్భంగా ప్రారంభించిన మసీదులో ఈ రంజాన్ మాసం అంతా ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సాజి తెలిపారు. ఖర్జురాలు, తాజా పండ్లు, చిరు ఆహార పదార్ధాలు, పండ్ల రసాలులతో విందు నిర్వహిస్తామన్నారు. రకరకాల బిర్యానీలను రుచి చూపించనున్నట్లు చెప్పారు. విందులో తరతమ స్థాయీ భేదాల్లేకుండా సిబ్బంది, ఉన్నతోద్యోగులంతా ఒక్కచోట చేరి ఇఫ్తార్ విందు ఆరగించడం ఆనందాన్నిస్తోందని సాజి పేర్కొన్నారు. అల్ హయల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈస్ట్ విల్లే రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్ లోగల మసీదులో 250 మంది ఒకేసారి ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న మైదానంలో ఒకేసారి మరో 700 మంది ప్రార్థనల్లో పాల్గొనవచ్చని సాజి వివరించారు. పాకిస్థాన్ కు చెందిన బస్ డైవర్ అబ్దుల్ ఖయ్యూం(63) సాజి ఇఫ్తార్ విందు నిర్వహణ ఆమోఘంగా ఉందని కొనియాడారు. ఇటువంటి మంచి వ్యక్తులు ఇంకా ఉండబట్టే ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తోందని ఉద్వేగంతో పేర్కొన్నారు.