Monday, September 23, 2019

Pak has reactivated terror camp at Balakot, India ready for challenge: Rawat


బాలాకోట్ లో మళ్లీ తిష్ట వేసిన పాక్ ఉగ్రమూకలు:ఆర్మీ చీఫ్ రావత్
భారత వాయుసేన మెరుపుదాడులతో భస్మీపటలం చేసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని బాలాకోట్ లో మళ్లీ ఉగ్రతండాలు వెలిశాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. చెన్నైలోని సైనికాధికారుల శిక్షణ కేంద్రం (ఓటీఏ)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావత్ విలేకర్లకు ఈ విషయం తెలిపారు. సుమారు 500 మంది చొరబాటుదారులు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రజల మాటు నుంచి ఈ కుయత్నాలకు పాల్పడుతోందన్నారు. భారత సైన్యం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుల్వామాలో (ఫిబ్రవరి 14న) పాక్ ప్రేరేపిత ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న అనంతరం భారత్ దీటుగా బదులిచ్చినా ఆ దేశం కళ్లు తెరవలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిచ్చిన పాక్ సైన్యం  నియంత్రణ రేఖ (ఎల్.ఒ.సి) వెంబడి కాల్పులు జరుపుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. పుల్వామా బాంబు పేలుడు తర్వాత (ఫిబ్రవరి 26న) భారత వాయుసేన పీఓకేలోని బాలాకోట్ లో దాగిన ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం రెండ్రోజుల క్రితం యుద్ధమంటూ వస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో కనపడదని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు అనంతరం హోంమంత్రి అమిత్ షా ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనమే మిగిలిఉందని పార్లమెంట్ లో ప్రకటించిన విషయం విదితమే. అయినా బలహీన పాకిస్థాన్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా కయ్యానికి కాలు దువ్వాలని ఉవ్విళ్లూరడమే విచిత్రంగా కనిపిస్తోంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై భంగపడుతూనే సమరనాదం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరూ గెలవరనే మాట అంటూనే కుయుక్తులు పన్నుతున్నారు. పీఓకే లోని వివిధ ప్రాంతాలలో జైష్-ఇ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహిస్తున్న 13 శిక్షణ శిబిరాలను తమ దేశం మూసివేసినట్లు ఇటీవల ప్రకటించారు. అందుకు భిన్నంగా తాజాగా అక్కడ ఉగ్ర కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడం ఎవరు తీసిన గోతిలో వారే పడతారనడానికి తార్కాణంగా కనబడుతోంది.