Thursday, April 11, 2019

large number of youth casts their votes


జోరందుకున్న పోలింగ్.. వెల్లివిరిసిన యువోత్సాహం
దేశం నలుమూలలా సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్ననికి ఊపందుకుంది. ఈవీఎంలు అనేక ప్రాంతాల్లో మొరాయించడంతో గంటల పాటు ఇబ్బంది ఎదురైన ఓటర్లు ఓపిగ్గా లైన్లలో వేచి ఉన్నారు. అనంతపురం,కడప, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులున్నా ఓటర్లు వెనుదిరగక ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్ లకు తరలి వస్తుండడం గమనార్హం. చాలా చోట్ల పోలింగ్కు అంతరాయం కల్గిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ ద్వివేది సాయంత్రం 6 గంటల వరకు లైన్లలో వేచి ఉన్న వారికి రాత్రి ఏ వేళయినా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

యువోత్సాహం

తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పోలింగ్ బూత్ లకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది. అదేవిధంగా మహిళలు, వృద్ధులు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.  సాయంత్రం 4 వరకు అందిన సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ జిల్లాల్లో పోలింగ్ శాతం కింది విధంగా ఉంది. కడప జిల్లాలో 56%, చిత్తూరులో 46.60%, కర్నూలులో 50%, అనంతపురంలో 44.80% , శ్రీకాకుళంలో 40.92%, విజయనగరంలో 57.19%, విశాఖపట్నంలో 40.71%, తూర్పుగోదావరిలో 47.21%, పశ్చిమగోదావరిలో 42.51 %, కృష్ణాలో 41.42%, గుంటూరులో 40.08%, ప్రకాశంలో 45.48%, నెల్లూరులో 47.04%, పోలింగ్ నమోదయినట్లు సమాచారం. అధికారిక పోలింగ్ శాతం వివరాలు మరికొన్ని గంటల్లో ఎన్నికల సంఘం వెల్లడించనుంది.



korean abortion ban ruled unconstitutional

అబార్షన్ల బిల్లు సరళతరం చేయాలని దక్షిణ కొరియా కోర్టు తీర్పు

దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం (కాన్ స్టిట్యూషనల్ కోర్టు) అబార్షన్ల నిషేధంపై చారిత్రక తీర్పు ఇచ్చింది. 1953 నుంచి గర్భస్థ విచ్ఛితిపై ఆ దేశంలో నిషేధం అమలులో ఉంది. ఓఈసీడీ (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) సభ్యత్వం గల 36 దేశాల్లో అబార్షన్లపై కఠినంగా నిషేధం అమలు చేస్తున్న ఏకైక దేశం దక్షిణ కొరియా. నిషేధం అమలులో ఉన్నా 2013-2017 మధ్య దేశంలో 70 మంది అబార్షన్ల చేయించుకున్నారు. దాంతో 2017 ఫిబ్రవరిలో ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలయింది. పూర్వపరాలు పరిశీలించిన కోర్టు గర్భం కూడా ఓ వ్యక్తి శరీరంలో భాగమేనని ఆ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రభుత్వాలు నియంత్రించజాలవని అభిప్రాయపడ్డారు. అందువల్ల యాంటీ అబార్షన్ బిల్లును 2020 నాటికి సరళీకరించాలని ప్రభుత్వానికి సూచించింది. లేదంటే అబార్షన్ బిల్లు రద్దు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దక్షిణ కొరియాలో అత్యాచారాలు లేదా రక్త సంబంధీకుల బలవంతం వల్ల గర్భం దాలిస్తేనే అబార్షన్ కు అనుమతి ఉంది. అదే విధంగా ఆరోగ్య సమస్యల దృష్ట్యా చట్టబద్ధంగా అబార్షన్ కు అనుమతి ఉంది. అలా కాకుండా నిషేధాన్ని ఉల్లంఘించి అబార్షన్ చేయించుకున్న మహిళకు ఏడాది జైలు, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కు రెండేళ్ల శిక్షలు ఆ దేశంలో అమలు చేస్తున్నారు. అబార్షన్ బిల్లుపై అక్కడి మహిళలు రెండు వర్గాలుగా విడిపోయారు. కోర్టు విచారణ నేపథ్యంలో గురువారం అబార్షన్ బ్యాన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు వేర్వేరుగా నినాదాలు చేశారు

anantapur two died in election riots



అనంతపురం,చిత్తూరు ఎన్నికల ఘర్షణల్లో ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం,చిత్తూరు జిల్లాల ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మంట్లోని వీరాపురం గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తడంతో కత్తి పోట్లకు దారితీసింది. పరస్పరం వేటకొడవళ్లతో చేసుకున్న దాడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్త పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రం మొత్తం రక్తసిక్తమై కొన్ని గంటలపాటు పోలింగ్ నిలిచిపోయింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దర్ని అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మరణించారు. తమ కార్యకర్త హత్య ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అయితే ఎం.పి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రిలో రిగ్గింగ్ కు పాల్పడుతుండగా తమ కార్యకర్తలు అడ్డుకున్నారని..దాంతో టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి తెగబడినట్లు వై.ఎస్.ఆర్.సి.పి ఆరోపించింది.