ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
భారత
అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ
ఖాతాలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో సోమవారం ఇస్రో రంగంలోకి దిగి ఆయనకు సోషల్ మీడియాలో
ఎటువంటి వ్యక్తిగత ఖాతా లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేస్తూ `కైలాస్వాదివు
శివన్` పేరిట సోషల్ మీడియాలో చాలా ఖాతాలు నడుస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ
ఖాతాల నుంచి చంద్రయాన్-2 సమాచారం అంటూ అసత్యాలు వెలువడుతున్నాయని వాటిని నమ్మొద్దని
కోరింది. చైర్మన్ డాక్టర్ కె. శివన్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతా ఒక్కటీ లేదని ఇస్రో
ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. చైర్మన్ పేరిట నకిలీ ఖాతాల నుంచి వెల్లడవుతున్న
సమాచారం ప్రామాణికం కాదని గమనించాలని కోరింది. ఎట్టి పరిస్థితిలో అబద్ధపు
ప్రచారాన్ని నమ్మరాదని ఇస్రో హెచ్చరించింది. చంద్రయాన్-2 మిషన్, చంద్రునిపై లాండర్
విక్రమ్ స్థితిగతులకు సంబంధించిన ఏదైనా నవీకరణ ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే
ఇవ్వనున్నట్లు ప్రకటించింది.