Wednesday, February 1, 2023

MLA kotam reddy sridhar reddy Serious On Phone Tapping

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ కలకలం చెలరేగింది. ఏకంగా అధికార వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నే సాక్షాత్తూ ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆధారాలు బయటపెట్టారు. అధికారంలో ఉన్న పెద్దల అనుమతితోనే ఇంటెలిజెన్స్ వర్గాలు తన ఫోన్ ను ట్యాప్ చేశాయన్నారు. తన మిత్రుడితో ఫోన్ మాట్లాడుతున్న ట్యాపింగ్ ఆడియోను విలేకర్లకు ఫార్వార్డ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్త అయిన తన చిన్ననాటి మిత్రుడితో మాట్లాడిన ఫోన్ ను ట్యాప్ చేసి ఆ ఆడియోను తనకే పంపి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. తామిద్దరం ఐఫోన్ లో మాట్లాడుకోగా ట్యాప్ చేశారన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఆ ఆడియోను తనకే పంపి ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారని వివరించారు. గత మూణ్నెల్లుగా తన ఫోన్ ట్యాప్ అవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ లేదా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓలో కీలక సలహాదారు ధనుంజయ్ రెడ్డి తదితరుల అనుమతి లేకుండా అధికారులు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేసే సాహసం చేయరని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అనుమానం ఉన్నచోట ఉండలేనని పార్టీ నుంచి బయటకు వచ్చేయనున్నట్లు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి తరఫున కోటంరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇచ్చింది అందరికీ తెలుసునని ఆయన బాధను వ్యక్తం చేశారు. నటన తనకు చేతకాదని ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డం మాత్రమే తెలుసన్నారు. నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు సమయం ఉన్నందున తొందర పడవద్దని సహచరులు తనను వారించారన్నారు. అయినా ఇక ఎంతమాత్రం పార్టీలో కొనసాగలేనని చెప్పారు. అధికార పార్టీకి చెందిన 35మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నట్లు కోటంరెడ్డి పాత్రికేయులకు తెలిపారు. అయితే కోటంరెడ్డి ఆరోపణల్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖండించారు. తమకు ఎవరి ఫోన్ ను ట్యాప్ చేయాల్సిన అగత్యం లేదని తేల్చి చెప్పారు.