Friday, November 13, 2020

Telangana High Court Bans Sale, Use Of Firecrackers Ahead Of Diwali

తెలంగాణలో బాణసంచా నిషేధం

తెలంగాణలో బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించారు. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఈమేరకు ఆదేశాలు  జారీ చేసింది.  బాణసంచా కాల్చడం వల్ల పెద్దఎత్తున వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శ్వాస కోశవ్యాధుల బారిన పడుతున్నారు. వీటి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింల్లో బాణసంచాపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా దీపావళికి ముందు రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం, వాడకాన్ని గౌరవ హైకోర్టు నిషేధించినట్లు సీనియర్ కౌన్సెల్ మాచార్ల రంగయ్య మీడియాకు తెలిపారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా బాణసంచా కాల్చొద్దని హైకోర్టు సూచించిందన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే  చాలా మంది ప్రాణాలు బలిగొంది. సంక్రమణ ప్రధాన లక్షణంగా గల కరోనా ఊపిరితిత్తుల పైనే అధికప్రభావం చూపుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అంతేగాక ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి నవంబర్ 19న నివేదికను సమర్పించాలని  హైకోర్టు ఆదేశాలిచ్చింది.