Thursday, May 16, 2019

mp teacher who got student slapped 168 times arrested



విద్యార్థిని హోంవర్క్ చేయలేదని 168 చెంపదెబ్బలు.. టీచర్ అరెస్ట్

హోంవర్క్ చేసుకురాలేదని ఓ విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయుడు 168 చెంపదెబ్బల కఠిన దండన విధించి జైలు పాలయిన ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లాలో ఈ దారుణం జరిగింది. తాండ్లా పట్టణంలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం సరిగ్గా లేక 2018 జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు రాలేదు. తర్వాత రోజు స్కూలుకు వచ్చిన బాలిక హోంవర్క్ చేయలేదని ఆగ్రహం చెందిన మనోజ్ వర్మ(35) తోటి విద్యార్థులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. వారానికి ఆరు రోజులు ఒక్కొక్కరూ రెండేసి చెంప దెబ్బలు చొప్పున ఆ బాలికను కొట్టాలని 14 మంది తోటి విద్యార్థులను ఆదేశించాడు.  ఉపాధ్యాయుడు ఆ విధంగా తమ బిడ్డకు శిక్ష అమలు చేశాడని ఆవేదన చెందిన బాలిక తండ్రి శివప్రసాద్ సింగ్ బాలికా సంరక్షణ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానంతో తల్లిడిల్లిన తమ పాప మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిచింది. శివప్రసాద్ జరిగిన ఘోరాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు ఈ ఘటన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో నిజమని తేలడంతో తాండ్లా పట్టణ పోలీసులు సోమవారం (మే13) ఉపాధ్యాయుడు మనోజ్ వర్మను అరెస్టు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ జైపటిదార్ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు. అదే రోజు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.