Saturday, January 11, 2020

Kerala Government collapses Huge multi storied building

కేరళలో 3 సెకన్లలోనే భారీ ఆకాశహార్మ్యం నేలమట్టం
అక్రమకట్టడాలపై కేరళ ప్రభుత్వం శనివారం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని నేల మట్టం చేసింది. ఈ ఉదయం కొచ్చిలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్సుల కూల్చివేత ప్రక్రియను అధికారులు సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. బ్యాక్ వాటర్ ను పట్టించుకోకుండా కొచ్చిలో ఈ విధంగా నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 350 కి పైగా ఫ్లాట్లుండగా 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆ గృహ సముదాయాల నుంచి ఖాళీ చేయించారు. అనంతరం రెండ్రోజుల ఈ కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వారాంతంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశంలోనే నివాస సముదాయాలతో కూడిన అతిపెద్ద కూల్చివేత డ్రైవ్‌లలో ఒకటిగా నిలిచింది. కొచ్చిలోని మారడు సరస్సు ఒడ్డున హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ పేరిట ఈ అక్రమ అపార్ట్ మెంట్లు వెలిశాయి. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఆకాశ హార్య్మాలు నిర్మించడంతో అయిదు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. గత ఏడాది కూడా పెను వరదల తాకిడికి కేరళ అల్లాడిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండు బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సుమారు 800 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే భారీ ఆకాశ హార్మ్యాన్ని నేలమట్టం చేయడం విశేషం.