Thursday, May 2, 2019

srilanka names all nine people behind easter suicide bombings


శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల నిందితుల వివరాలు వెల్లడి
ఈస్టర్ సండే నాడు (ఏప్రిల్21) వరుస బాంబు పేలుళ్లతో సుమారు 300 మందిని పొట్టనబెట్టుకున్న నిందితుల వివరాల్ని శ్రీలంక వెల్లడించింది. గురువారం (మే2) పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తొమ్మిది మంది నిందితుల పేర్లు ప్రకటించారు. జహరాన్ హషిం(షంగ్రి లా బాంబర్స్- స్థానిక జిహాదీ గ్రూపు నాయకుడు), హషిం(నేషనల్ తౌహీద్ జమాత్-ఎన్జీజే నేత), ఇన్షాఫ్ అహ్మద్, మహ్మద్ అజం ముబారక్ మమ్మద్ (ఇతని భార్య ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది), అహ్మద్ మౌజ్ (ఇతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నాడు), మహ్మద్ హస్తున్, మహ్మద్ నజీర్ మహ్మద్ అసద్, అబ్దుల్ లతీఫ్ (అసద్, లతీఫ్ లు- బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదువుకున్నారు). వరుస పేలుళ్ల తర్వాత అనుమానంతో కొలంబో లో ఓ ఇంటిపై భద్రత బలగాలు దాడి చేయగా ఫాతిమా ఇల్లహమ్ తనంత తాను బాంబు పేల్చేసుకోవడంతో ఆమె ఇద్దరు పిల్లల సహా మరో ఇద్దరు అధికారులు మృత్యువాత పడ్డారు. తీవ్రవాదుల ఆర్థిక వ్యవహారాల నిరోధక చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేయనున్నట్లు గుణశేఖర తెలిపారు.

pm modi reviews preparedness on cyclone fani issues directions


ఫొని తుపాన్ పై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (మే2) ఫొని తుపాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన తుపాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. తుపాన్ కదికలికలను అడిగి తెలుసుకున్న ప్రధాని ఎటువంటి విపత్కర పరిస్థితనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, సైనిక బలగాల మోహరింపు తదితరాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు, టెలికాం సర్వీసులపై అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐ.ఎం.డి, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా ఫొని తుపాన్ శుక్రవారం ఒడిస్సా తీరాన్ని తాకవచ్చని తెలుస్తోంది. దాంతో సుమారు ఎనిమిది లక్షల మంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.