Friday, June 28, 2019

South Africa unanimous win over srilaka by 9 wickets inicc world cup


శ్రీలంకను ఉతికి ఆరేసిన దక్షిణాఫ్రికా:9 వికెట్ల విజయం
నాకౌట్ అవకాశాలు ఆవిరైన వేళ దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ లో తన పూర్వవైభవాన్ని ప్రదర్శిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 డర్హమ్ లోని ఎమిరేట్స్ రివర్ సైడ్ మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ నం.35లో 9 వికెట్ల తేడాతో లంక సింహాలపై సఫారీలు అద్భుతమైన గెలుపు అందుకున్నారు. టాస్ గెలిచిన ద.ఆఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్  శ్రీలంకను బ్యాటింగ్ కు దించాడు. నిర్ణీత 50 ఓవర్లకు గాను శ్రీలంక 49.3 ఓవర్లలో 203 స్వల్ప పరుగులకే ఆలౌటయింది. ఏమాత్రం కష్టతరం కానీ లక్ష్యం 204 పరుగుల్ని సఫారీలు సునాయాసంగా ఛేదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడారు. లంకకు దక్కిన ఏకైక వికెట్ ను లసిత్ మలింగ చేజిక్కించుకున్నాడు. ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వాంటన్ డీకాక్(15) క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ హషిం అమ్లా(80*), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(96*) ప్రాక్టీస్ సెషన్ మాదిరిగా అలవోకగా బ్యాటింగ్ చేస్తూ37.2 ఓవర్లలోనే గెలుపునకు కావాల్సిన పరుగులు రాబట్టారు. అమ్లా 105 బంతుల్ని, డూప్లెసిస్ 103 బంతుల్ని ఎదుర్కొని జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించారు. డూప్లెసిస్ సెంచరీ మిస్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ బౌలర్ల మీద అపార నమ్మకంతో బ్యాటింగ్ ను అశ్రద్ధ చేసినట్లు కనిపించింది. మరో వైపు సఫారీ పేస్ బౌలర్లు క్రిస్ మోరిస్, డ్వయిన్ ప్రెటోరిస్, కగిసొ రబాడ బాణాల్లా సంధించిన బంతులకు లంక బ్యాట్స్ మెన్ బ్యాట్ లు ఎత్తేశారు. లంక బ్యాట్స్ మెన్ లో ముగ్గురు మినహా అందరూ రెండంకెల స్కోరును అందుకున్నారు. అయితే చాలా బంతుల్ని వృథా చేయడమే కాకుండా అవుటై తర్వాత వచ్చే బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెంచేశారు. కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్ అతి నెమ్మదిగా ఆడి డాట్ బాల్స్ కు కారకులయ్యారు. కెప్టెన్ దిముత్ కరుణరత్న మ్యాచ్ తొలి బంతికే రబాడ బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), వన్డౌన్ అవిశ్కా ఫెర్నాడో లు సాధించిన చెరో 30 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు. దీన్ని బట్టే శ్రీలంక బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో స్పష్టమౌతోంది. జట్టులో కుశాల్ మెండిస్(23), ధనంజయ డిసిల్వ(24), తిసారా పెరీరా(21) లు మాత్రమే 20 పరుగులు స్కోరు దాటిన బ్యాట్స్ మెన్. ద.ఆఫ్రికా బౌలర్లలో రబాడ 36/2, మోరిస్ 46/3 ప్రిటోరిస్ 25/3 ఆండిలే ఫెహ్లుక్వాయో 38/1 జేపీ డుమిని 15/1 వికెట్లను పడగొట్టారు. అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్ తో పొదుపుగా పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ ప్రిటోరిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

Big brands bet on World Cup fever in India, where cricket is `religion`


ప్రపంచ పండుగలా కొనసాగుతున్న ఐసీసీ వరల్డ్ కప్
ప్రస్తుతం ప్రపంచమంతా ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ పండుగలో లీనమైపోయింది. సుమారు 100 కోట్ల 50 లక్షల మంది వరల్డ్ కప్ క్రికెట్ ను తిలకిస్తున్నారు. ప్రత్యక్షంగా, టెలివిజన్, రేడియో, మొబైల్ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ ల్ని వీరంతా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ ల వీక్షకుల సంఖ్య కంటే 15 రెట్లు అధికంగా వరల్డ్ కప్ మ్యాచ్ ల్ని వీక్షిస్తున్నారు. ప్రపంచంలో క్రికెట్ ఇప్పుడు కేవలం ఓ ఆట కాదు.. మతం. ప్రపంచం నలుమూలలా సాకర్ ఆడే దేశాలు కోకొల్లలు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్ బాల్ అసోసియేషన్(ఫిఫా) గుర్తింపు పొందిన దేశాలు 79. టోర్నీలో అర్హత సాధించిన దేశాలు పాల్గొంటాయి. 2018 రష్యా(మాస్కో)లో జరిగిన గత ఫిపా వరల్డ్ కప్ లో 32 దేశాలు ఆడాయి. కానీ వరల్డ్ కప్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 20 లోపే. అందులో క్వాలిఫై అయిన 10 దేశాలు ఐసీసీ వరల్డ్ కప్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ ల్ని ఒక్క భారత ఉపఖండంలోనే సుమారు 80 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు ప్రాయోజికులు(స్పాన్సర్స్), వాణిజ్య ప్రకటన దారులు (మీడియా బయ్యర్స్) అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే క్రికెట్ ను వాణిజ్య సంస్థలు చక్కగా ఉపయోగించుకుని తమ వ్యాపారాల అభివృద్ధికి బాటగా మలుచుకుని ముందుకెళ్తున్నాయి. క్రికెట్ ఆసరాగా ప్రకటనల రంగం ప్రపంచ వ్యాప్తంగా టి.వి, రేడియో, పత్రికలు, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రచారపర్వంతో దూసుకెళ్తోంది. క్రికెట్ అభిమానులే తమ వినియోగదారులుగా రకరకాల ఆఫర్లతో ఊరిస్తూ మార్కెట్ ను వ్యాపార, వాణిజ్య సంస్థలు ఊపేస్తున్నాయి. లైవ్ ఫాన్ ఈవెంట్స్ తదితరాలతో వ్యాపార అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రవాణా సంస్థ ఉబర్ మొదలుకొని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్, తినుబండారాల సంస్థ మాండెలెజ్ వరకు అన్ని సంస్థలు క్రికెట్ అభిమానులే ఆలంబనగా వ్యాపారాభివృద్ధితో పండుగ చేసుకుంటున్నాయి.