Thursday, August 1, 2019

Make it mandatory for mps to visit child welfare centers demands supriya sule


లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు లోక్ సభలో ఏకగ్రీవంగా మద్దతు
లోకసభలో గురువారం పార్టీలకు అతీతంగా సభ్యులు లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి మరణశిక్ష పడుతుంది. ఈ బిల్లు పట్ల అన్ని పక్షాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్.సి.పి) సభ్యురాలు సుప్రియ సూలే(శరద్ పవార్ తనయ) ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎంపీ బాలల సంరక్షణ కేంద్రాల్ని విధిగా సందర్శించాలనే నిబంధన విధించాలని డిమాండ్ చేశారు. పిల్లలపై ఈ లైంగిక వేధింపుల నిరోధక ముసాయిదా బిల్లుకు ఆమె మద్దతు తెల్పుతూ ఈవ్ టీజింగ్ (ఆకతాయిల ఆగడాలు)ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో దాదాపు అన్ని బాలల సంరక్షణ కేంద్రాలు అకృత్యాలకు అడ్డాలుగా మారిపోయాయని, పిల్లలు నిరంతరం అక్కడ మోసాలకు గురౌతున్నారని సభ దృష్టికి తెచ్చారు. అందుకే ఉభయ సభలకు చెందిన సభ్యులు ప్రతి ఒక్కరూ విధిగా ఆ కేంద్రాల్లో తనిఖీలకు వెళ్లేలా నిబంధన విధించాలన్నారు. అప్పుడే ఆ కేంద్రాల నిర్వాహకుల్లో అప్రమత్తత వస్తుందని బాలలకు భరోసా లభిస్తుందని చెప్పారు. ఎంపీల ఆకస్మిక తనిఖీలతో బాలల సంరక్షణ కేంద్రాలు సజావుగా నడుస్తాయని సుప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సభ్యులు కున్వర్ దానిష్ అలీ బిల్లుకు మద్దతు ఇస్తూ తను ఉరిశిక్షకు వ్యతిరేకమైనా పిల్లలపై అకృత్యాలకు పాల్పడిన వారి విషయంలో బిల్లు నిర్దేశిస్తున్న ప్రకారం విధించే శిక్ష సరైనదిగానే భావిస్తున్నానన్నారు.