Saturday, May 18, 2019

Vande bharat express completes 1 lakh km


లక్ష కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న `వందే భారత్`
న్యూఢిల్లీ-వారణాసిల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయంగా నిర్మితమైన ఈ హైస్పీడ్ రైలు ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు ప్రత్యామ్నాయంగా వందే భారత్ పేరిట ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మధ్య వారానికి  అయిదు రోజులు ప్రయాణిస్తోంది. తొలిరోజు తిరుగు ప్రయాణంలో మాత్రం కాన్పూర్ వద్ద స్వల్ప అంతరాయంతో కొద్ది సేపు నిలిచిపోవడం మినహా ఇప్పటి వరకు వందే భారత్ సజావుగా ప్రయాణం సాగిస్తోంది. చెన్నై లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ.సి.ఎఫ్) నుంచి రెండో దశలో రూపుదిద్దుకున్న ఈ రైలు కోచ్ లు మే నెలాఖరుకు ఢిల్లీ చేరనున్నాయి. తొలిదశ కోచ్ లలో కనిపించిన లోటుపాట్లను సరిచేసి మరిన్ని సౌకర్యాలతో కొత్త కోచ్ లను సిద్ధం చేశారు.  ఈ రైలూ ఢిల్లీ-వారణాసి మధ్యే పరుగులు తీయనుంది. తర్వాత దశల వారీగా అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్ ప్రయాణించనుంది.

4 militants killed in encounter with security forces in J-K's Pulwama baramulla dist



కశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత
కశ్మీర్ లో భద్రతా బలగాలు శనివారం (మే18) వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చివేశాయి. ఈ ఎదురు కాల్పులు పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని పంజ్గామ్ ప్రాంతంలోని అవంతిపొరలో తెల్లవారుజామున సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులకు దిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్.టి)గ్రూపునకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమర్చాయి. పహారా కాస్తున్న భద్రత దళాలకు ఉగ్రవాదుల ఉనికి తెలిసింది. దాంతో వారు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ ముగ్గురికి పలు ఉగ్ర కార్యకలాపాలతో సంబంధముంది. తాజా ఎన్ కౌంటర్ లో ప్రాణాలు విడిచిన ముగ్గురు పుల్వామా జిల్లాకే చెందిన షౌకత్ దార్, ఇర్ఫాన్ వార్, ముజఫర్ షేక్ లుగా గుర్తించారు. వీరు ప్రధానంగా పౌర ఆవాసాలు, భద్రతా బలగాలపై దాడులకే ప్రత్యేకించి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది జవాన్ ఔరంగజేబు హత్యతో దార్ కు సంబంధముందన్నారు. ఇదే ప్రాంతంలోని దలిపొరలో గురువారం ఓ ఇంట్లో దాగిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు పొగొట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా శనివారం ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కనుగొని కాల్చివేయడంతో ఆపరేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.  మరో వైపు బారాముల్లా జిల్లాలోని సొపొర్ పట్టణంలో హిజ్బుల్ గ్రూప్ నకే చెందిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఈ ఉదయం సోదాలు నిర్వహిస్తూ ఎన్ కౌంటర్ చేశాయి.