Tuesday, May 28, 2019

3 West Bengal MLAs, several councillors join BJP in Delhi



బీజేపీలో చేరిన ముగ్గురు పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో మంగళవారం (మే28) కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు సుబ్రంగ్షు రాయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో సైతం బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. సుబ్రంగ్షు రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని భావించిన టీఎంసీ ఆయనను లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సస్పెండ్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే తుషార్కంటి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబేంద్ర నాథ్ రాయ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శి కైలాస్ విజయవర్గియ, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరారు. బెంగాల్ లో అధినేత్రి మమత నేతృత్వంలోని టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేర్చడంలో ముకుల్ రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ తాజా ఫలితాల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ సుమారు రెండు పదుల స్థానాలు కైవశం చేసుకోవడంలో ఆయన తీవ్రంగా కృషి చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మమత 2011లో పాలనాపగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి టీఎంసీకి ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీకి 34 స్థానాలు దక్కగా ఈసారి 22 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ రాష్ట్రంలో 2 స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది.

Chandrababu participates in ntr`s birth anniversary programme



ఘనంగా ఎన్టీయార్ 97వ జయంతి వేడుకలు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు మంగళవారం(మే28) ఘనంగా జరిగాయి. ఆయన మనవళ్లు సినీ నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు ఈ ఉదయం 6కే హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ కు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు తాతతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరు పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ `నా ప్రాణసమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాభివందనాలు`... మన కుటుంబ పెద్ద  ఎన్టీయార్ తనకేదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆంధ్రుల ఆత్మగౌరవం, సమాజంలో చైతన్యం కోసమే వచ్చారన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని ఎదురు నిలిచారని చెప్పారు. ఎన్టీయార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రగా నిలిచిపోయారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలించారని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని నిరంతరం ప్రజాశ్రేయస్సుకే ముందుకు సాగుదామని చెప్పారు.