Friday, May 31, 2019

Neither now nor in future nithish sayson possibility of jd(u)joining modi government



భవిష్యత్ లో కూడా మోదీ ప్రభుత్వంలో చేరబోం:సీఎం నితిష్
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఎన్డీయే సర్కార్ కు షాక్ ఇచ్చారు. శుక్రవారం(మే31) ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా చేరబోమని తేల్చి చెప్పేశారు. అయితే ఎన్డీయే మిత్రపక్షంగా తాము కొనసాగుతూనే ఉంటామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వేళ తాము తొలుత తీసుకున్న నిర్ణయమే మున్ముందు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనతాదళ్ (యునైటెడ్) కీలక సంఘం(కోర్ కమిటీ) తీవ్రంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్డీయే పక్షాల ఐక్యతకు చిహ్నంగా కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తాజా కేంద్ర మంత్రివర్గంలో తొలుత జె.డి(యు) చేరాలనుకున్నా తర్వాత పార్టీలో కీలక చర్చల అనంతరం చేరరాదనే తుది నిర్ణయం తీసుకున్నట్లు నితిష్ తెలిపారు. కేవలం ఐక్యతా చిహ్నంగా ఉండేందుకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనుకోవడం లేదన్నారు. బిహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నమాట(బీజేపీతో కలిసి) వాస్తవమేనంటూ ఆయన తమ ప్రభుత్వంలో కచ్చితమైన దామాషాలో భాగస్వామ్య పక్షాలకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు.

Thursday, May 30, 2019

Narendra modi ys jagan sworn-in their respective government head posts



పీఎంగా మోదీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలు గురువారం(మే30) ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయగా ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిల్లో అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రపతి భవన్ లో గురువారం రాత్రి 7గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు 58 మంది లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25మంది కేంద్రమంత్రులుగా, 9 మంది స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయమంత్రులుగా, మరో 24 మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగువారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి సహాయమంత్రిగా ప్రమాణం చేయగా ఆరుగురు మహిళా మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకాసింగ్ సరుతా, దేవశ్రీ చౌదురి మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మనోహర్ జోషి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్  తదితర ప్రముఖులు హాజరైన వారిలో ఉన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ(పశ్చిమబెంగాల్), నవీన్ పట్నాయక్(ఒడిశా), పినరయి విజయన్(కేరళ), వై.ఎస్.జగన్(ఏపీ), కేసీఆర్(తెలంగాణ), అమరీందర్ సింగ్(పంజాబ్), భూపేశ్ భగల్(ఛత్తీస్ గఢ్), కమల్ నాథ్(మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లాట్(రాజస్థాన్)లు హాజరుకాలేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తో గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ఒక్కరే ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తానని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లపై తొలి సంతకం చేసిన జగన్ మొదటి ఏడాది రూ.2250 తర్వాత ఏడాది రూ.2500, ఆపై ఏడాది రూ.2750 చొప్పున అవ్వా,తాతలకు అందిస్తానంటూ ఆ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి రెండో సంతకం చేశారు. ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం లక్షా50వేల గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామన్నారు. వారికి వేతనంగా నెలకు రూ.5వేలు చెల్లిస్తామని వారికి మెరుగైన ఉపాధి లభించే వరకు వాలంటీర్లగా కొనసాగుతారన్నారు. రాష్ట్రంలో యువతకు మొత్తం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ వివరించారు.

Wednesday, May 29, 2019

left reunification is panacea to fight bjp says cpi



బీజేపీని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరం
దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరమని సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కాషాయీకరణ ప్రమాదపుటంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 19 నుంచి21 వరకు జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దిశగా చర్చల్ని ముమ్మరం చేయనున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం(మే29) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వామపక్షాలన్నీ ఒక్క పార్టీగా ఏకీకృతం కావాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏకీకరణనే డిమాండ్ చేస్తున్నట్లయితే ఆ దిశగా అన్ని వామపక్షాలు అడుగులేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం ఒకటి కన్నా తక్కువకు పడిపోయిన నేపథ్యంలో జాతీయపార్టీ హోదాను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీలో సమీక్ష నిర్వహించారు. వామపక్షాల సహా లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతినడం వల్లే బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేయగల్గిందని సుధాకర్ రెడ్డి అన్నారు. లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులోని డీఎంకే సంకీర్ణ పక్షాలకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాల్ని కేటాయించిందన్నారు. ఒక్క తమిళనాడు లోనే కాంగ్రెస్, డీఎంకే కూటమితో సీపీఐ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో 1925లో ఏర్పడిన సీపీఐ పార్టీ ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించాలనే ఏకైక అంశంపై రెండుగా చీలిపోయింది. 1964 కోల్ కతాలో జరిగిన సీపీఐ ఏడో సర్వసభ్య సమావేశాల్లో చీలిక సంభవించి సీపీఐ(ఎం) ఏర్పడింది.

Tragedy averted, 50 girls rescued from blaze in Janakpuri hostel



అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 55 మంది బాలికలు
పశ్చిమ ఢిల్లీలో బుధవారం (మే29) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం బారినపడ్డ 55 మంది బాలికల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సూరత్ లో ఇటీవల ఓ ఆర్ట్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరగ్గా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఢిల్లీ జనక్ పురి మెట్రో రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఓ బాలికలు వసతి గృహం(హాస్టల్)లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నికీలలు చుట్టుముట్టగా పిల్లలు అల్లాడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. అందులోని బాలికలందర్నీ సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అయితే వీరిలో ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో ఇద్దరు బాలికల్ని డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఊపిరితిత్తుల్లోకి విపరీతంగా పొగ చూరగొనడంతో అస్వస్థతపాలయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కట్టడి చేశారు. తీవ్రంగా శ్రమించి వసతి గృహ భవనంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్(డి.ఎఫ్.ఎస్) చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. తమకు తెల్లవారు 3సమయంలో సమాచారం అందగా వెంటనే అక్కడకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది చేరుకున్నారన్నారు. మంటల్ని 3.30 సమయానికి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

Tuesday, May 28, 2019

3 West Bengal MLAs, several councillors join BJP in Delhi



బీజేపీలో చేరిన ముగ్గురు పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో మంగళవారం (మే28) కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు సుబ్రంగ్షు రాయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో సైతం బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. సుబ్రంగ్షు రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని భావించిన టీఎంసీ ఆయనను లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సస్పెండ్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే తుషార్కంటి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబేంద్ర నాథ్ రాయ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శి కైలాస్ విజయవర్గియ, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరారు. బెంగాల్ లో అధినేత్రి మమత నేతృత్వంలోని టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేర్చడంలో ముకుల్ రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ తాజా ఫలితాల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ సుమారు రెండు పదుల స్థానాలు కైవశం చేసుకోవడంలో ఆయన తీవ్రంగా కృషి చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మమత 2011లో పాలనాపగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి టీఎంసీకి ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీకి 34 స్థానాలు దక్కగా ఈసారి 22 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ రాష్ట్రంలో 2 స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది.

Chandrababu participates in ntr`s birth anniversary programme



ఘనంగా ఎన్టీయార్ 97వ జయంతి వేడుకలు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు మంగళవారం(మే28) ఘనంగా జరిగాయి. ఆయన మనవళ్లు సినీ నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు ఈ ఉదయం 6కే హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ కు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు తాతతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరు పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ `నా ప్రాణసమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాభివందనాలు`... మన కుటుంబ పెద్ద  ఎన్టీయార్ తనకేదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆంధ్రుల ఆత్మగౌరవం, సమాజంలో చైతన్యం కోసమే వచ్చారన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని ఎదురు నిలిచారని చెప్పారు. ఎన్టీయార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రగా నిలిచిపోయారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలించారని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని నిరంతరం ప్రజాశ్రేయస్సుకే ముందుకు సాగుదామని చెప్పారు.

Monday, May 27, 2019

Pak SC makes history by hearing case via e-Court



పాక్ సుప్రీంకోర్టు లో తొలిసారి ఈ-కోర్టు కేసు విచారణ
పాకిస్థాన్ న్యాయ వ్యవస్థ చరిత్రలో సోమవారం (మే27) కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ఆ దేశ సుప్రీంకోర్టు తొలిసారిగా ఈ-కోర్టు పద్ధతిలో కేసు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలో జస్టిస్ తారిఖ్ మసూద్, జస్టిస్ మజర్ అలాం ఖాన్ మయిన్ఖేల్ లతో కూడిన ఇస్లామాబాద్ లోగల సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సుప్రీంకోర్టు కరాచీ రిజిస్ట్రీ నుంచి న్యాయవాది ఆన్ లైన్ లో కేసును సుప్రీం ధర్మాసనం ముందుంచారు. సుప్రీంకోర్టు హాల్ లో కంప్యూటర్ కు అనుసంధానం చేసిన వీడియో లింక్ ద్వారా విచారణ కొనసాగించారు. ఈ సౌకర్యంతో పలువురు న్యాయవాదులు, కక్షిదారులూ లబ్ధి పొందగలరని భావిస్తున్నారు. విలువైన సమయం, ధనం కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా పదవిలోకి వచ్చిన ఖోసా జనవరిలోనే కొండల్లా పేరుకున్న కేసులు, విచారణ జాప్యాలను త్వరలో నివారించాల్సి ఉందని పేర్కొన్నారు. సంస్థాగతంగా ఓ క్రమపద్ధతిలో కేసుల విచారణ పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అనవసర ఆలస్యాల నివారణ, వ్యాజ్యాల కుదింపు, పనిభారం తగ్గింపు దిశగా ముందడుగు వేయాలని చీఫ్ జస్టిస్ ఖోసా పేర్కొన్నారు. పాత, కొత్త కేసుల విచారణను ఎటువంటి జాప్యం లేకుండా ఇకపై ఈ-కోర్టు ద్వారా చకచకా నిర్వహించే వీలుకల్గుతుందని పాక్ న్యాయవ్యవస్థ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Sunday, May 26, 2019

teenager held for allegedly stalking assaulting Russian tourist in goa



రష్యా యువతిని వేధించిన కేసులో మహారాష్ట్ర యువకుడి అరెస్ట్
భారత్ పర్యటనకు వచ్చిన ఓ రష్యా యువతిని వేధించిన 19ఏళ్ల కుర్రాడిని ఆదివారం(మే26) మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర గోవాలోని నగోవా గ్రామానికి వచ్చిపోతుండే అశ్పక్ ముజావర్ అనే యువకుడి మే15న అక్కడ ఓ రష్యా యువతి వెంటపడి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఆమె అతణ్ని నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనను వేధించడంతో పాటు చెంపదెబ్బ కొట్టాడని ఆమె వివరించినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు జరిపేందుకు వారు నిరాకరించారు. జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఆమె వద్ద ఉండడంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర పోలీసులు గుర్తించి అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

This is the time to fight special status issue of Andhra Pradesh:Jagan



ప్రధానితో జగన్ భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీని ఆదివారం(మే26) కలిసిన జగన్ గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్ లో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. విభజన కోరుకోని ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన నేపథ్యంలో హామీ ప్రకారం ప్రత్యేక హోదాను ఇవ్వాలి కదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తమ ప్రాధాన్యాంశాల్లో ప్రత్యేక హోదా అంశం కచ్చితంగా ఉందని ఇకపై ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలో ఇదే అడుగుతానన్నారు. మీ పై కేసులున్నాయి కదా ఎలా ఎదుర్కోబోతున్నారన్న ప్రశ్నకు జగన్ ప్రజలిచ్చిన తాజా తీర్పులోనే అవి వాస్తవమైనవా? కావా? అనే విషయం స్పష్టమౌతోందని చెప్పారు. తను అమిత్ షాను కూడా కలవడంపై జగన్ సమాధానమిస్తూ దేశంలో అమిత్ షా రెండో అత్యంత శక్తిమంతుడైన నాయకుడు ఆయనను కలిసి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించానని, రాష్ట్రానికి ఆర్థిక సాయం గురించి కోరానని జగన్ చెప్పారు. మీకు 22 మంది ఎంపీల బలం ఇప్పుడుంది ప్రత్యేకహోదా సాధించగలమనే నమ్మకం ఉందా అని ఓ విలేకరి జగన్ ను ప్రశ్నించారు. అందుకు బదులిస్తూ పత్యేక హోదాను ఇప్పుడు సాధించలేకపోతే ఇక ఎప్పటికీ రాదు.. తప్పకుండా తమ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ ను హైదరాబాద్ లో శనివారం (మే25) మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. తనకు ప్రత్యేక హోదాపై పోరాటంలో మద్దతు ఇస్తానని కేసీఆర్ మరోసారి ప్రకటించారని జగన్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

Saturday, May 25, 2019

No need for Rahul Gandhi mamatha benerjee to resign their respective parties opinioned



రాహుల్ దీదీల రాజీనామాల్ని అంగీకరించని కాంగ్రెస్ తృణమూల్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. శనివారం (మే25) ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి (ఏఐసీసీ) ఈ మేరకు తీర్మానించింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో రాహుల్ కొనసాగాలని ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మీడియా ఇన్ చార్జ్ రణదీప్ సుర్జీవాలా పాత్రికేయులకు తెలిపారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఏఐసీసీ సమావేశానికి రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి దారుణపరాజయం పాలైన నేపథ్యంలో రాహుల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన మే23నే రాజీనామాకు సిద్ధమవ్వగా సోనియా వారించి ఏఐసీసీ భేటీ వరకు ఆగాలని సముదాయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కష్ట కాలంలో సిద్ధాంత పోరులో పార్టీకి రాహుల్ సారథ్యం అనివార్యమని ముఖ్యంగా యువత, రైతులు, ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీలు, పేదలు, అణగారిన వర్గాల తరఫున ఇంతకుముందు మాదిరిగానే ఆయన పోరాడాలని ఏఐసీసీ ముక్తకంఠంతో కోరింది. ఈ రోజు దేశ రాజధానిలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , ఏకేఅంటోని, గులాంనబీ అజాద్, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, చిదంబరం వంటి ముఖ్యనేతలు, సీఎంలు అమరిందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాగ్వేల్ తదితరులు హాజరయ్యారు.
సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న మమత వారించిన టీఎంసీ
పశ్చిమబెంగాల్ లో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. కోల్ కతాలోని కాళీఘాట్ లో గల తన  నివాసం నుంచి మమతా ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించారు. తను సీఎంగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో పార్టీ గెలుపునకు సమయం వెచ్చించలేకపోయినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తనకు అడ్డుగోడగా నిలవడం వల్లే రాష్ట్రంలో బీజేపీ అనుకోనిరీతిలో పుంజుకోగల్గిందని అందువల్ల రాజీనామా చేయాలని మమతా నిర్ణయం తీసుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మమతా రాజీనామా నిర్ణయాన్ని తిరస్కరించింది.

Kerala coast on high alert as 15 isis terrorists from srilana set off to ministry island lakshadweep in boat



ఐసీస్ ఉగ్రవాదుల ముప్పు: అప్రమత్తమైన భారత్ తీరరక్షణ దళం
భారత్ లో చొరబడేందుకు ఐఎస్ఐఎస్(ఐసీస్) ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో దేశ తీర రక్షణ దళం అప్రమత్తమయింది. శ్రీలంక నుంచి 15 మంది ఉగ్రవాదులు తెల్లటి పడవలో బయలుదేరారని శనివారం(మే25) కచ్చితమైన సమాచారాన్ని నిఘావర్గాలు అందించాయి. కేరళలోని త్రిసూర్, కోజికోడ్ తీరాల్లోని గస్తీని ముమ్మరం చేశారు. మత్స్యకార సంఘాల్ని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల్ని గుర్తిస్తే తమకు తక్షణం సమాచారం అందించాలని కోరారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాల ఎన్ కౌంటర్ లో పేరుమోసిన మిలిటెంట్ కమాండర్ జకీర్ రషీద్ భట్(జకీర్ ముసా)ను మట్టుబెట్టిన నేపథ్యంలో దేశంలోని భద్రతా, నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం కేరళ తీరంలో రెడ్ అలర్ట్ అమలవుతోంది.


Friday, May 24, 2019

India bans Jamaat-ul-Mujahideen Bangladesh terror outfit



జమాత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థపై భారత్ నిషేధాస్త్రం
బంగ్లాదేశ్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే జమాత్ ఉల్ ముజాహిద్దీన్(జె.ఎం.బి) సంస్థను భారత ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశంలోని బుర్ద్వాన్, గయాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో ఈ ఉగ్ర సంస్థ కు చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉందనే అనుమానంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఎంబీ తన కార్యకలాపాల్ని భారత ఉపఖండం మొత్తం విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. కేంద్ర హోంశాఖ గురువారం (మే23) జె.ఎం.బి.ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జిహాద్ నినాదంతోపాటు ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ సంస్థ 1998 నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి గ్రూపులోకి చేర్చుకుని వారికి ఉగ్రవాద కార్యకలాపాల శిక్షణ ఇస్తోంది. భారత్ లో ఈ సంస్థ తమ కార్యకలాపాల్ని విస్తరించే పనిలో నిమగ్నమైనట్లు అనుమానిస్తున్నారు. 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ లో, 2018 జనవరిలో బుద్ధ గయలో పేలుళ్లకు పాల్పడిన వారిలో ఈ జె.ఎం.బి. ఉగ్రవాదులున్నట్లు భావిస్తున్నారు. అసోం పోలీసులు అయిదు కేసుల్లో జె.ఎం.బి. పాత్రను నిర్ధారించారు. ఈ గ్రూపునకు చెందిన 56 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో పశ్చిమబెంగాల్, అసోం, త్రిపుర, బంగ్లా-భారత్ సరిహద్దుల్లోని 10 కి.మీ. పరిధిలో ఉగ్ర కార్యకలాపాలకు జె.ఎం.బి. రచించిన ప్రణాళికలు వెల్లడికావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.  

PM Narendra Modi, Amit Shah meet Advani, Murli Manohar Joshi



అద్వానీ జోషీలను కలిసిన ప్రధాని మోదీ
తాజా లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అనూహ్య విజయాన్ని అందుకున్న ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక, కురువృద్ధులైన నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడగా ఒక రోజు వ్యవధిలోనే బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా వెంట రాగా మోదీ శుక్రవారం(మే24) తన గురువు అద్వానీ, జోషిలను వారి నివాసాలకు వెళ్లి కలుసుకుని విజయానందాన్ని పంచుకున్నారు. ఈ రోజు బీజేపీ విజయం సాధించిందంటే అద్వానీజీ దశాబ్దాలుగా పార్టీ నిర్మాణానికి వేసిన పునాదులు, సాగించిన కృషి ఫలితమేనని, తాజా ఆలోచనా విధానాన్ని ఆయన ప్రజల వద్దకు చేర్చారంటూ ట్వటర్ లో మోదీ పేర్కొన్నారు. జోషి గురించి ట్వీట్ చేస్తూ మోదీ..ఆయన గొప్ప విద్యావంతుడు, మేధావి.. భారతీయ విద్యా విధానంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. అహరహం బీజేపీ పటిష్టతకు కృషి చేశారు..తనతోపాటు పలువురు కార్యకర్తల్ని ఆయన తీర్చిదిద్దారని ప్రశంసించారు.

Thursday, May 23, 2019

Naveen Patnaik's BJD set to form government in Odisha

నవీన్ పట్నాయక్ అయిదోసారి సీఎంగా జయకేతనం


ఒడిశాలో మళ్లీ బిజూ జనతాదళ్(బీజేడీ) అధికారాన్ని చేజిక్కించుకుంది. అయిదోసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ, 21 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో నవీన్ సారథ్యంలో బీజేడీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 2000 వ సంవత్సరం నుంచి సీఎంగా ఎన్నికవుతున్న నవీన్ 2019లో మరోసారి ఆ పదవిని అధిష్టించనున్నారు. నవీన్ పట్నాయక్ తల్లిదండ్రులు జ్ఞాన్ పట్నాయక్(పంజాబీ), బిజూ పట్నాయక్(మాజీ ముఖ్యమంత్రి)లకు 1946, అక్టోబర్16న కటక్ లో జన్మించారు. తండ్రి బిజూ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా 1961-63లో తొలిసారి పనిచేశారు. తర్వాత 1990-95 వరకు రెండోసారి సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. 1997లో బిజూ పట్నాయక్  మరణానంతరం ఆయన ద్వితీయ కుమారుడు నవీన్ పట్నాయక్ 11వ లోక్ సభకు అస్కా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు.  

Wednesday, May 22, 2019

lok sabha polls 2019: highest ever voter turnout: election commission



లోక్ సభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తోన్న ఓట్ల శాతం
గడిచిన ఒకటిన్నర దశాబ్దంగా జరుగుతున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓట్ల శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటీవల 17వ లోక్ సభ ఎన్నికల క్రతువు ఆరు వారాలు నిర్విఘ్నంగా కొనసాగి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 11న మొదలైన ఎన్నికల పోలింగ్ 7 దశల్లో మే 19న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 543 నియోజకవర్గాలకు గాను 542 స్థానాలకు(545 మంది మొత్తం సభ్యుల్లో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు) పోలింగ్ నిర్వహించారు. విచ్చలవిడిగా డబ్బుల కట్టలను కనుగొన్న తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో  ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 7దశల్లో సాగిన పోలింగ్ లో మొత్తం ఓటింగ్ 67.11 శాతంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పేర్కొంది. తొలిదశలో అత్యధికంగా 69.61 శాతం నమోదయింది. అన్ని రాష్ట్రాల్లో కన్నా హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి అత్యధికంగా 72.25 శాతం ఓటింగ్ నమోదై రికార్డు నెలకొల్పింది. 2014 ఎన్నికల్లో 66.40 శాతం కన్నా ఈసారి కొంత మెరుగ్గా ఓటింగ్ జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మొత్తం 58.19 శాతమే ఓటింగ్ నమోదయింది. 2004లో 56 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Tuesday, May 21, 2019

mumbai model gets bail in fake currency case



నకిలీ నోట్ల కేసులో మోడల్ కు బెయిల్
నకిలీ నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేసి అరెస్టయిన 28 ఏళ్ల మోడల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై గత నెల ఏప్రిల్ 19న ఆమెను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మోడల్ సబర్బన్ బాంద్రా లోని బ్యాంక్ లో రూ.2 వేల నోట్లు 75 డిపాజిట్ చేశారు. అందులో 42 నోట్లు నకిలీవిగా కరెన్సీ కౌంటింగ్ మెషిన్ గుర్తించింది. బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మోడల్ ఈ మొత్తాన్ని కేసులో సహ నిందితుడు రాహుల్ బరోద్ వద్ద నుంచి ఏవో అవసరాల నిమిత్తం తీసుకున్నట్లు ఆమె తరఫున లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిలో నకిలీ నోట్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదని అందుకే తన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లారని విన్నవించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీస్ స్టేషన్ అధికారి కూడా ప్రాథమిక దర్యాప్తు లో ఆమెకు నకిలీ కరెన్సీని చలామణి చేసే ఉద్దేశం ఉన్నట్లు తేలలేదని కోర్టుకు తెలిపారు. ఏవ్యక్తి నకిలీ నోట్లను తమ సొంత బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే సాహసం చేయరన్న ప్రాసిక్యూషన్ వాదనకు సమ్మతించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఎ.ఎం.ఖాన్ మోడల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చారు.

PM Modi pays tribute to Rajiv Gandhi on his death anniversary



రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మోదీ సోనియా రాహుల్ ప్రియాంక
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం (మే21) ఆయనకు  ఘన నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు ఘన నివాళులు అని పేర్కొన్నారు. యమునా నదీ తీరంలో గల వీర్ భూమి లోని రాజీవ్ సమాధిని సందర్శించి సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక ఘన నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో రాజీవ్ కు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ ఆరో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు పరిపాలించారు. 1991 మే 21న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదుర్ బహిరంగ సభకు వెళ్లిన రాజీవ్ ను.. ఎల్టీటీఈ మానవబాంబు ద్వారా దారుణంగా హత్య చేసింది.

Monday, May 20, 2019

egyptian forces kill 12 suspected militants in raids

ఈజిప్టు భద్రతా బలగాల కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదుల హతం

ఈజిప్టులో భద్రతా బలగాలు సోమవారం(మే20) తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురపడిన 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలోని గాజా పిరమిడ్ల సందర్శనకు వచ్చిన విదేశీయుల లక్ష్యంగా ఉగ్రవాదులు రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేల్చడంతో బస్ లో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాజా పిరమిడ్లకు సమీపంలో నిర్మాణంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో బస్ లో మొత్తం 28 మంది ప్రయాణికులున్నారు. పేలుడు వల్ల మ్యూజియం కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పురావస్తు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈరోజు కాల్పులో చనిపోయిన 12 మంది ఉగ్రవాదులు బాంబు పేలుడు కుట్రదారులుగా భావిస్తున్నారు. అంతకుముందు ఈజిప్టులోని దక్షిణాఫ్రికా రాయబారి వుసి మువింబెల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. 



Sunday, May 19, 2019

modi’s jobs deficit: J&J’s largest India plant idle three years after completion



నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని 
జాన్సన్ అండ్ జాన్సన్ 
భారత్ లోనే అతి పెద్ద తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నెలకొల్పింది. ఈ అమెరికా కంపెనీ ద్వారా సౌందర్య సాధనాలు, బాలలకు సంబంధించిన వస్తు ఉత్పత్తులు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా పెంజెర్లలో 47 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ఉత్పత్తి కార్యక్రమాల ఊసే లేదు. ఈ కంపెనీ పని చేయడం ప్రారంభిస్తే 1500 మందికి ఉపాధి లభిస్తుంది. కంపెనీ కేంద్ర కార్యాలయం న్యూజెర్సీలోని న్యూబ్రన్స్ విక్ లో ఉంది. భారత్ లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముంబయిలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటయింది. నిర్మాణం పూర్తి చేసుకుని మూడేళ్లయినా ఉత్పత్తి కార్యకలాపాలు ఎందుకు ప్రారంభకాలేదని ముంబయి లోని సంస్థ అధికారుల్ని సంప్రదిస్తే కేంద్ర కార్యాలయంలోనే ఆ విషయాలు తెలుస్తాయని తప్పించుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రద్దు చేయడం, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. నిజానికి బేబీ కేర్ వస్తువులు, సౌందర్య సాధనాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు భారత్ లో గిరాకీ ఎక్కువ. అయినా ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఉత్పత్తుల ప్రారంభానికి యాజమాన్యం ముందుకు రావట్లేదని స్పష్టమౌతోంది.


Political ad spend on Facebook, Google tops Rs 53 cr



రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ఖర్చు రూ.53 కోట్లు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డిజిటల్ యాడ్స్ కు రూ.53 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందులో సింహభాగం భారతీయ జనతా పార్టీ ఖర్చు చేసింది. ముఖ్యంగా ఆయా పార్టీలు ఫేస్ బుక్, గూగుల్ యాడ్లకే ఎక్కువ ఖర్చు చేసినట్లు గణాంకాలు  స్పష్టం చేస్తున్నాయి. ఫేస్ బుక్ నివేదిక ప్రకారం ఈ 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1.21 లక్షల రాజకీయ ప్రచార యాడ్స్ జనంలోకి వెళ్లాయి. ఇందుకు గాను మే15 నాటికి ఆ పార్టీలు 26.5 కోట్లు వెచ్చించాయి. ఇదంతా ఫిబ్రవరి19-మే15 తేదీల మధ్యనే వ్యయం చేశారు. గూగుల్, యూట్యూబ్, ఇతర గ్రూపు సామాజిక మాధ్యమాలు 14,837 యాడ్స్ పబ్లిష్ చేయడం ద్వారా ఫిబ్రవరి 19 నుంచి మే15 వరకు రూ.27.36కోట్లు ఆర్జించాయి. ఇందులో బీజేపీ వాటా రూ.4.23 కోట్లు. ఒక్క ఫేస్ బుక్ ద్వారా ఆ పార్టీ యాడ్స్ 2500 వరకు జనంలోకి వెళ్లాయి. మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ, భారత్ కి మన్ కి బాత్, నేషన్ విత్ నమో టూ తదితర యాడ్స్ సామాజిక మాధ్యమాల్లో విరివిగా చక్కెర్లు కొట్టాయి. 20 కోట్ల మందికి దేశంలో సామాజిక మాధ్యమ అకౌంట్లున్నాయని ఓ అంచనా. మరో వైపు కాంగ్రెస్ పార్టీ గూగుల్ యాడ్స్ కోసం రూ.17 కోట్లు, ఫేస్ బుక్ ద్వారా ప్రచారానికి రూ.1.46 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ ఫేస్ బుక్ ద్వారా 3,686 యాడ్స్, గూగుల్ ద్వారా 425 యాడ్స్ గుప్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రూ.29.28కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ.13.62 కోట్లు ఫేస్ బుక్ యాడ్స్ కు వెచ్చించాయి. ఆప్ గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారానికి రూ.2.18 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ప్రచారానికి సంబంధించి కచ్చితత్వంతో కూడిన మొత్తం లెక్కలన్నింటిని నివేదికలో వెల్లడిస్తామని ప్రకటించాయి.  

Saturday, May 18, 2019

Vande bharat express completes 1 lakh km


లక్ష కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న `వందే భారత్`
న్యూఢిల్లీ-వారణాసిల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయంగా నిర్మితమైన ఈ హైస్పీడ్ రైలు ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు ప్రత్యామ్నాయంగా వందే భారత్ పేరిట ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మధ్య వారానికి  అయిదు రోజులు ప్రయాణిస్తోంది. తొలిరోజు తిరుగు ప్రయాణంలో మాత్రం కాన్పూర్ వద్ద స్వల్ప అంతరాయంతో కొద్ది సేపు నిలిచిపోవడం మినహా ఇప్పటి వరకు వందే భారత్ సజావుగా ప్రయాణం సాగిస్తోంది. చెన్నై లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ.సి.ఎఫ్) నుంచి రెండో దశలో రూపుదిద్దుకున్న ఈ రైలు కోచ్ లు మే నెలాఖరుకు ఢిల్లీ చేరనున్నాయి. తొలిదశ కోచ్ లలో కనిపించిన లోటుపాట్లను సరిచేసి మరిన్ని సౌకర్యాలతో కొత్త కోచ్ లను సిద్ధం చేశారు.  ఈ రైలూ ఢిల్లీ-వారణాసి మధ్యే పరుగులు తీయనుంది. తర్వాత దశల వారీగా అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్ ప్రయాణించనుంది.

4 militants killed in encounter with security forces in J-K's Pulwama baramulla dist



కశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత
కశ్మీర్ లో భద్రతా బలగాలు శనివారం (మే18) వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చివేశాయి. ఈ ఎదురు కాల్పులు పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని పంజ్గామ్ ప్రాంతంలోని అవంతిపొరలో తెల్లవారుజామున సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులకు దిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్.టి)గ్రూపునకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమర్చాయి. పహారా కాస్తున్న భద్రత దళాలకు ఉగ్రవాదుల ఉనికి తెలిసింది. దాంతో వారు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ ముగ్గురికి పలు ఉగ్ర కార్యకలాపాలతో సంబంధముంది. తాజా ఎన్ కౌంటర్ లో ప్రాణాలు విడిచిన ముగ్గురు పుల్వామా జిల్లాకే చెందిన షౌకత్ దార్, ఇర్ఫాన్ వార్, ముజఫర్ షేక్ లుగా గుర్తించారు. వీరు ప్రధానంగా పౌర ఆవాసాలు, భద్రతా బలగాలపై దాడులకే ప్రత్యేకించి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది జవాన్ ఔరంగజేబు హత్యతో దార్ కు సంబంధముందన్నారు. ఇదే ప్రాంతంలోని దలిపొరలో గురువారం ఓ ఇంట్లో దాగిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు పొగొట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా శనివారం ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కనుగొని కాల్చివేయడంతో ఆపరేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.  మరో వైపు బారాముల్లా జిల్లాలోని సొపొర్ పట్టణంలో హిజ్బుల్ గ్రూప్ నకే చెందిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఈ ఉదయం సోదాలు నిర్వహిస్తూ ఎన్ కౌంటర్ చేశాయి.

Friday, May 17, 2019

naidu step ups kejriwal yechuri to meet rahul mayawati akilesh before may23


రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో నేతలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం(మే17) ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ 19న జరగనుండగా ఫలితాలు 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. మే23న మిత్రపక్షాలు,  కాంగ్రెస్ తో కలిసి వచ్చే అవకాశం ఉన్న పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. అంతకు వారం ముందుగానే చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో మరోసారి కీలకపాత్ర పోషించడానికి ఉద్యుక్తులయ్యారు. శుక్రవారం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకుని చర్చలు జరిపారు. శనివారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. తర్వాత లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయవతి, సమాజ్ వాది పార్టీ అధినాయకుడు అఖిలేశ్ యాదవ్ లను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ టీఆర్ఎస్ సహా భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే అన్ని పక్షాలను తమ కూటమిలోకి స్వాగతిస్తామన్నారు. ఢిల్లీ చేరగానే తొలుత ఆయన ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలతో పాటుగా 50 శాతం వీవీప్యాట్ ల్ని లెక్కించాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాల తీరు ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో కొనసాగిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. రీపోలింగ్ తదితర చాలా అంశాల్లో స్థానిక అధికారుల తీరు వివాదాస్పదమయిందన్నారు. ముఖ్యంగా ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో 38 రోజుల తర్వాత 5 కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టనుండడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వై.ఎస్.ఆర్.సి.పి. సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోరగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్ణయాన్ని ఇటీవల వెల్లడించింది. తొలివిడత ఏప్రిల్11నే ఇక్కడ ఎన్నిక పూర్తవ్వగా ఎన్నికల మలిదశ మే19న రీపోలింగ్ తలపెట్టడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Two Indian climbers dead, Irishman missing in Nepal's Himalayas

హిమాలయాల్లో ఇద్దరు భారత పర్వతారోహకుల మృతి..ఆచూకీ లేని ఐర్లాండ్ వాసి
హిమాలయ పర్వతారోహక బృందంలోని ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఒక ఐర్లాండ్ జాతీయుడి ఆచూకీ తెలియరావడం లేదు. శుక్రవారం(మే17) అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ నెలలో మృతి చెందిన పర్వతారోహకుల సంఖ్య ఆరుకు చేరింది. నేపాల్ మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో ఒకటైన మకాలు పర్వతారోహణకు వెళ్లిన న్యూఢిల్లీకి చెందిన రవి ఠకర్(27), నారాయణ్ సింగ్(34) మృతి చెందగా డబ్లిన్ లో టీచరయిన సీమస్ సీన్ లాలెస్(39) జాడ తెలియడం లేదు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఏజెన్సీకి చెందిన థానేశ్వర్ గుర్గాయిన్ అందించిన వివరాల ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ సౌత్ కోల్(శిఖర లోయ) శిబిరంలోనే ప్రాణాలు కోల్పోయిన రవి ఠకర్ ను కనుగొన్నారు. అయితే అతని మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అననుకూల వాతావరణం కారణంగానే అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మకాలు నుంచి తిరుగు ప్రయాణంలో నారాయణ్ సింగ్ అస్వస్థతకు గురై గురువారం మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి మిరా ఆచార్య తెలిపారు. అతను ఉత్తరాఖండ్ కు చెందిన సైనికుడని తెలుస్తోంది. సాహసయాత్రలో ఉండగా గురువారం సీమస్ కాలు జారి మంచులోయలోకి పడిపోయినట్లు సమాచారం. 

UN health agency highlights lifestyle choices to prevent dementia



చక్కటి జీవనశైలి వ్యాయామంతో మతిమరుపు దూరం: డబ్లూహెచ్ఓ
ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న తాజా ఆరోగ్య సమస్య డెమెన్షియా (చిత్తవైకల్యం- మతిమరుపు). ప్రస్తుతం విశ్వ వ్యాప్తంగా అయిదు కోట్ల మంది (50మిలియన్లు) ఈ వ్యాధి బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల ప్రకటించింది. ఏటా కోటి మంది(10మిలియన్లు) కొత్తగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ఈ సమస్యకు చాలా సులభమైన పరిష్కారాన్ని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ధూమపానం(స్మోకింగ్), మద్యపానం(డ్రింకింగ్) మానేసి చక్కటి జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ డెమెన్షియా దరిచేరదని పేర్కొంది. అంతేగాక పై చిట్కా ద్వారా ఊబకాయం, రక్తపోటు, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండి గుండె, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ  డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధ్నామ్ గాబ్రియెసిస్ సూచించారు. తమ సంస్థ ఇప్పటికే బోస్నియా, హెర్జ్ గొవినా, క్రోయేసియా,ఖతర్, స్లొవేనియా, శ్రీలంక తదితర దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. డెమెన్షియా వ్యాధిని గుర్తించే పరీక్ష శిబిరాలు, చికిత్స తదితరాల పైన డబ్ల్యూహెచ్ఓ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా డెమెన్షియా వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు డబ్యూహెచ్ఓ మానసిక ఆరోగ్య పరిరక్షణ విభాగ డైరెక్టర్ డాక్టర్ డెవొరా కెస్టెల్ పేర్కొన్నారు. ఆన్ లైన్ కార్యక్రమాల ద్వారా ఎవరికి వారు తమ సమస్యను గుర్తించొచ్చని చెప్పారు. కుటుంబ సభ్యులు, విధి నిర్వహణలో సహ సిబ్బందితో వ్యవహారశైలి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా డెమెన్షియా లక్షణాల్ని గుర్తించి తగు చికిత్స ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని తెలిపారు.

Thursday, May 16, 2019

mp teacher who got student slapped 168 times arrested



విద్యార్థిని హోంవర్క్ చేయలేదని 168 చెంపదెబ్బలు.. టీచర్ అరెస్ట్

హోంవర్క్ చేసుకురాలేదని ఓ విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయుడు 168 చెంపదెబ్బల కఠిన దండన విధించి జైలు పాలయిన ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లాలో ఈ దారుణం జరిగింది. తాండ్లా పట్టణంలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం సరిగ్గా లేక 2018 జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు రాలేదు. తర్వాత రోజు స్కూలుకు వచ్చిన బాలిక హోంవర్క్ చేయలేదని ఆగ్రహం చెందిన మనోజ్ వర్మ(35) తోటి విద్యార్థులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. వారానికి ఆరు రోజులు ఒక్కొక్కరూ రెండేసి చెంప దెబ్బలు చొప్పున ఆ బాలికను కొట్టాలని 14 మంది తోటి విద్యార్థులను ఆదేశించాడు.  ఉపాధ్యాయుడు ఆ విధంగా తమ బిడ్డకు శిక్ష అమలు చేశాడని ఆవేదన చెందిన బాలిక తండ్రి శివప్రసాద్ సింగ్ బాలికా సంరక్షణ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానంతో తల్లిడిల్లిన తమ పాప మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిచింది. శివప్రసాద్ జరిగిన ఘోరాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు ఈ ఘటన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో నిజమని తేలడంతో తాండ్లా పట్టణ పోలీసులు సోమవారం (మే13) ఉపాధ్యాయుడు మనోజ్ వర్మను అరెస్టు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ జైపటిదార్ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు. అదే రోజు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

Wednesday, May 15, 2019

i`ll fight it won't apologise for sharing mamata's photo: bjp activist



జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు..క్షమాపణలు చెప్పను: ప్రియాంక శర్మ
`నేనేమీ క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదు..ఈ కేసుపై పోరాడతా` అని మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మ అన్నారు. న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ప్రియాంకచోప్రా ఫొటోలో సీఎం మమత ఫొటోను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడం, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.  సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం(మే15) ఉదయం ఆమె అలీపూర్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆమె విలేకర్ల తో మాట్లాడుతూ జైలులో తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పారు. జైలర్ తనను జైలు గది లోకి నెట్టి తలుపు వేశారన్నారు. అప్పుడు ఆయనతో తనేమీ నేరస్తురాలిని కాదని ఈ విధంగా నెట్టడమేంటని ప్రశ్నించానన్నారు. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రియాంక శర్మ చెప్పారు. జైలుకు తరలించడంపై తన కుటుంబంతో పాటు తను కూడా వేదన చెందానన్నారు. ప్రియాంకశర్మ విడుదల సందర్భంగా దక్షిణ కోల్ కతాలో గల జైలుకు పెద్ద సంఖ్యలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేరుకుని ఆమెకు ఆహ్వానం పలికారు.

madona`s performance in doubt may 18 Eurovision conest



యూరో విజన్ లో మడోనా పాల్గొనడం అనుమానమే!
ఇజ్రాయిల్ నగరం టెల్ అవివ్ లో మే18న జరుగనున్న యూరో విజన్ పాటల ప్రదర్శనలో ప్రఖ్యాత పాప్ గాయని మడోనా పాల్గొనడం అనుమానంగానే ఉంది. మడోనా పాల్గొంటున్నట్లు ఆమె తరఫు అమెరికా, బ్రిటన్ ప్రచారకర్తలు ఏప్రిల్ లోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆమె ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదని యూరోవిజన్ ఎగ్జిక్యూటివ్ సూపర్ వైజర్ జాన్ ఒలా శాండ్ తెలిపారు. ఆమె కాంట్రాక్ట్ పై సంతకం పెడితేనే తమ వేదికపై ప్రదర్శన ఇవ్వగలరన్నారు. తొలుత మడోనా రెండు పాటలు ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ఆల్బమ్ `మేడమ్ ఎక్స్` నుంచి ఓ పాట, 1989లో పేరొందిన తన మరో పాటను ఆమె వేదికపై ప్రదర్శిస్తారని భావించారు. 2010  నుంచి యూరోవిజన్ ను నిర్వహిస్తున్న శాండ్ మాట్లాడుతూ ఇంకా మడోనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమ వేదికపై ప్రఖ్యాత కళాకారులు పాల్గొనాలనే కోరుకుంటామని అయితే అందుకు కొన్ని నియమనిబంధనలు కూడా పెట్టుకున్నామని వివరించారు. మే18న యూరో విజన్ కార్యక్రమంలో ద్వితీయ అర్ధభాగం మడోనా పాటల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆమె టెల్ అవివ్ చేరుకుని రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ మడోనా ప్రోగ్రాం రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన యూరో విజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tuesday, May 14, 2019

zimbabwe sold 97 elephants to china dubai for $2.7m



చైనా దుబాయ్ లకు ఏనుగుల్ని విక్రయించిన జింబాబ్వే
మా దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది.. వాటిని కాపాడుతూ పోషించే శక్తి మాకు లేదు.. అమ్మేస్తాం.. కొంటారా.. అంటోంది ఆఫ్రికా దేశం జింబాబ్వే. అందుకు తగ్గట్లు గానే ఆరేళ్లలో వంద లోపు ఏనుగుల్ని ఆ దేశం విక్రయాల ద్వారా వదిలించుకుంది. ఇటీవల లెక్కల ప్రకారం ఏనుగుల విక్రయం ద్వారా రూ.14 కోట్ల 55 లక్షలు(2.7మిలియన్ డాలర్లు) ఆర్జించింది. 2012 నుంచి ఇప్పటి వరకు చైనా, దుబాయ్ లకు జింబాబ్వే 97 ఏనుగుల్ని విక్రయించింది. ఇందులో చైనాకు అత్యధికంగా 93 ఏనుగుల్ని, దుబాయ్ కి నాలుగు ఏనుగుల్ని అమ్మేసింది. ఈ విషయన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ప్రిస్కా ముఫ్మిర వార్తా సంస్థలకు తెలిపారు. విక్రయించిన ఏనుగులన్నీ రెండు మూడేళ్ల లోపువేనన్నారు. తమ అభరణ్యాలు, ఇతర పార్కుల్లో 55 వేల ఏనుగుల్ని మాత్రమే సంరక్షించగలమని అయితే ప్రస్తుతం జింబాబ్వేలో 85 వేల ఏనుగులున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో ఏనుగును కనీసం రూ.9లక్షల నుంచి రూ.29లక్షలకు ($13,500- $41,500) విక్రయించామన్నారు. ముఖ్యంగా వేటగాళ్ల బారి నుంచి ఏనుగుల్ని రక్షించడం కూడా ఆఫ్రికా దేశాలకు ఇబ్బందిగానే పరిణమించింది. వాటిని సంరక్షించేందుకు అయ్యే ఖర్చును ఆ దేశాలు భరించే స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలకు వాటిని విక్రయించడమే మార్గమని భావిస్తున్నాయి. బోట్స్వానా రాజధాని కసానే లో ఇటీవల జరిగిన ఎలిఫాంట్ సమ్మిట్ సందర్భంగా బోట్స్వానా, జాంబియా, నమిబియా, జింబాబ్వే దేశాల నేతలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విక్రయాల్లో ప్రస్తుతం జింబాబ్వే ముందు వరుసలో ఉంది.