Wednesday, May 29, 2019

left reunification is panacea to fight bjp says cpi



బీజేపీని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరం
దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరమని సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కాషాయీకరణ ప్రమాదపుటంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 19 నుంచి21 వరకు జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దిశగా చర్చల్ని ముమ్మరం చేయనున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం(మే29) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వామపక్షాలన్నీ ఒక్క పార్టీగా ఏకీకృతం కావాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏకీకరణనే డిమాండ్ చేస్తున్నట్లయితే ఆ దిశగా అన్ని వామపక్షాలు అడుగులేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం ఒకటి కన్నా తక్కువకు పడిపోయిన నేపథ్యంలో జాతీయపార్టీ హోదాను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీలో సమీక్ష నిర్వహించారు. వామపక్షాల సహా లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతినడం వల్లే బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేయగల్గిందని సుధాకర్ రెడ్డి అన్నారు. లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులోని డీఎంకే సంకీర్ణ పక్షాలకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాల్ని కేటాయించిందన్నారు. ఒక్క తమిళనాడు లోనే కాంగ్రెస్, డీఎంకే కూటమితో సీపీఐ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో 1925లో ఏర్పడిన సీపీఐ పార్టీ ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించాలనే ఏకైక అంశంపై రెండుగా చీలిపోయింది. 1964 కోల్ కతాలో జరిగిన సీపీఐ ఏడో సర్వసభ్య సమావేశాల్లో చీలిక సంభవించి సీపీఐ(ఎం) ఏర్పడింది.

No comments:

Post a Comment