పాకిస్థాన్ లో బాంబు పేలుడుకు
20 మంది బలి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శుక్రవారం
బాంబు పేలుడుకు 20 మంది దుర్మరణం చెందారు. క్వెట్టాలోని ఓ మార్కెట్ లో ఈ ఉదయం
పేలుడు సంభవించింది. ఈ దాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అయిదుగురి
పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. షియా వర్గానికి చెందిన
హజరాలు పెద్ద సంఖ్యలో ఈరోజు మార్కెట్ కు వచ్చారు. వీరంతా కూరగాయలు కొనుగోలు
చేస్తుండగా పేలుడు జరిగింది. పేలుడు దాటికి పలువురు మాంసపు ముద్దలుగా మారారు. చాలా
మంది శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఈ ప్రాంతమంతా రక్తసిక్తమై యుద్ధభూమిని తలపించింది.
ఆగంతకులు బంగాళాదుంపల సంచుల్లో బాంబును పెట్టి ఉంటారని అనుమానిస్తున్నట్లు
క్వెట్టా పోలీస్ చీఫ్ అబ్దుల్ రజాక్ చీమా తెలిపారు. క్వెట్టాలో ఆరు లక్షల వరకు
హజారాల జనాభా ఉంది. ఈ వర్గం వారిపై తరచు దాడులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద
సంఖ్యలో ఈ మార్కెట్ ప్రాంతంలో భద్రత బలగాల గస్తీ ఉంటుంది. 2013 నుంచి బలూచిస్థాన్
ప్రావిన్స్ లో హజరాలపై కాల్పులు, బాంబు దాడులు జరుగుతుండగా ఇంతవరకు 509 మంది
చనిపోయినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
No comments:
Post a Comment