Monday, August 5, 2019

Assisted dying:Australian cancer patient first to use new law


ఆస్ట్రేలియాలో స్వచ్ఛంద మరణం పొందిన తొలి కేన్సర్ రోగి

కేన్సర్ తుది దశకు చేరుకుని వ్యధ అనుభవిస్తున్న ఆస్ట్రేలియా మహిళ కెర్రీ రాబర్ట్ సన్(61) కారుణ్య మరణం పొందారు. యూథనేష్యా (వ్యాధి నయం అవుతుందనే ఆశ లేనప్పుడు మందులతో ప్రాణం పోగొట్టడం) ద్వారా ప్రాణాలు విడిచిన తొలి కేన్సర్ రోగి ఆమె. విక్టోరియా రాష్ట్రంలో ఆమె తనకు స్వచ్ఛంద మరణం ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిపుణులైన వైద్యుల సమక్షంలో మరణాన్ని ఆశ్రయించారు. ఈ వివాదాస్పద `కారుణ్య మరణ చట్టం` ఆ రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చింది. ఆరు నెలలకు మించి రోగి బతకరనే వైద్యుల నివేదిక ఆధారంగా సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణలో మరణాన్ని ప్రసాదిస్తారు. భరించలేని బాధను అనుభవిస్తున్న రోగి స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటూ దరఖాస్తు చేసిన 29 రోజులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. జూన్ లో ఈ మేరకు అభ్యర్థించిన కెర్రీకి జులైలో ప్రభుత్వం అనుమతించింది. కుటుంబ సభ్యులు కూడా `ఆమె కోరుకున్న అధికారం మరణం`(The empowered death that she wanted) అని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కెర్రీకి జాక్వి, నికోల్ అనే ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె అంతిమ ఘడియల్లో బంధువులందరూ దగ్గరే ఉన్నామని.. తన తల్లి కెర్రి చివరి మాటగా జీవితాన్ని నిరాడంబరంగా, హుందాగా గడపమని సూచించినట్లు నికోల్ రాబర్ట్ సన్ తెలిపింది. ఆమె జీవించిన క్షణాలన్నీ సంతోషంగా ఉండేటట్లు చూసుకున్నామని అలాగే ఆమె మరణం లోనూ ప్రశాంతంగా సాగిపోయేందుకు సహకరించామంది. రాబర్ట్ సన్ ప్రకటనను `చారిటీ గో జెంటిల్ ఆస్ట్రేలియా` విడుదల చేసింది. 2010 నుంచి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న కెర్రీ 2019 జులై వరకు కిమో థెరపీ, రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. ఆమె ఈ చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో అనేక సైడ్ ఎఫెక్ట్ లకు గురయ్యారు. కేన్సర్ ఆమె శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయ భాగాలకు వ్యాధి సోకింది. భరించలేని బాధను అనుభవిస్తున్న ఆమె విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మరణాన్ని పొందింది. ఇదే తరహా కారుణ్య మరణాలు కెనడా, నెథర్లాండ్స్, బెల్జియంల్లో అమలులో ఉన్నాయి.

Sunday, August 4, 2019

Chandrayan-2 captures imges of earth


చంద్రయాన్-2 తీసిన భూమి చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
చంద్రయాన్ -2 తీసిన భూమి తాజా చిత్రాల్ని ఇస్రో ఆదివారం విడుదల చేసింది. మిషన్ లోని విక్రమ్ లాండర్ అధునాతన ఎల్.ఐ.4 కెమెరా ద్వారా తీసిన చిత్రాలు శనివారం సాయంత్రం 6.28కి భూమికి చేరాయి. వీటిని ఇస్రో అధికారికంగా విడుదల చేసింది. అంతకుముందు వారం రోజుల క్రితం చంద్రయాన్-2 తీసిన చిత్రాలంటూ వైరల్ అయిన ఫొటోలు నకిలీవిగా తేలింది. ప్రస్తుతం ఇస్రో విడుదల చేసిన చంద్రయాన్-2  ఫొటోలు అత్యంత నాణ్యమైనవిగా ఉన్నాయి. వైరల్ అయిన ఫొటోల్లో కొన్ని గతంలో నాసా (అమెరికా) తీసిన చిత్రాలు, మరికొన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) నుంచి వ్యోమగాములు తీసిన చిత్రాలు కావొచ్చని తెలుస్తోంది. వీటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రుడిపైకి చంద్రయాన్-2 రోవర్ సెప్టెంబర్ 7కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం జులై 22న విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-1  ప్రయోగం విజయవంతమైన 11 ఏళ్లకు ఇస్రో ఈ రెండో ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడిపై తొలి ప్రయోగాన్ని ఇస్రో 2008 అక్టోబర్ లో చేపట్టి విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం నీటి జాడల్ని ఇస్రో ఈ ప్రాజెక్టు ద్వారానే ప్రపంచానికి వెల్లడించింది. ప్రస్తుతం చంద్రయాన్-2 రెండు కక్ష్యల్ని దిగ్విజయంగా అధిగమించి ఆగస్ట్ 6న మూడో కక్ష్యలోకి అడుగుపెట్టనుంది. 

Saturday, August 3, 2019

Unnao cases: CBI speeds up investigation arms licence of expelled BJP MLA cancelled


ఉన్నావ్ హత్యాచార కేసుల్లో ఎమ్మెల్యే ఆయుధ లైసెన్స్ రద్దు
రాయ్ బరేలీ(యూపీ)లోని ఉన్నావ్ అత్యాచార, హత్య కేసుల్లో నిందితుడైన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్  ఆయుధ లైసెన్స్ ను రద్దు చేశారు. రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ దేవేందర్ కుమార్ పాండే ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఉన్నావ్ లో అత్యాచార కేసును ఎదుర్కొంటున్న కుల్దీప్ కోర్టు విచారణకు హాజరవుతున్న బాధితుల్ని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేశాడనే అభియోగాలు నమోదయిన సంగతి తెలిసిందే. బాధితురాలు, బంధువులైన ఇద్దరు మహిళలు, న్యాయవాది కోర్టుకు వెళ్లేందుకు కారులో ప్రయాణిస్తుండగా ట్రక్కుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి యాక్సిడెంట్ చేశారు. ప్రణాళికా ప్రకారం చేసిన ప్రమాదంలో బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. దాంతో ఎమ్మెల్యే కుల్దీప్ పై హత్య కేసు సైతం దాఖలయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నావ్ బాధితురాలి ప్రమాద ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశానుసారం నిందితుడిపై రాయ్ బరేలీ జిల్లా అధికార వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి. తాజాగా అతని ఆయుధాల లైసెన్స్ ను రద్దు చేశారు. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎమ్మెల్యే కుల్దీప్ పేరిట గల మూడు ఆయుధ లైసెన్స్ లను నిలిపివేశారు. ప్రమాద ఘటన కేసులో ట్రక్కు డ్రైవర్,క్లీనర్ సహా తొమ్మిది మందిని సీబీఐ సీతాపూర్ జైలుకు తరలించనుంది. అత్యాచార కేసులో కుల్దీప్ ఇప్పటికే ఈ జైలులో ఉన్నారు. సీబీఐ 15 రోజుల్లో ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయనుంది. అనంతరం మిగిలిన నిందితుల్ని సీతాపూర్ జైలుకు తరలించనున్నారు. శనివారం సీబీఐ బృందం ప్రమాద(హత్య) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల్ని కలుసుకుని వారి కథనాన్ని నమోదు చేసింది. ప్రమాదంలో గాయపడిన న్యాయవాది స్టేట్ మెంట్ ను అధికారులు నమోదు చేయనున్నారు. మరోవైపు బాధితురాలి తల్లి తన కుమార్తె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఆసుపత్రికి తరలించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలికి లక్నోలోని వైద్యశాలలో కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు. 2017 జూన్ 4న సదరు బాధితురాలు ఉద్యోగం కోసం వెళ్లగా ఆమెపై బంజెరుమావు ఎమ్మెల్యే కుల్దీప్ అత్యాచారానికి ఒడిగట్టాడు. దాంతో గత ఏడాది సీబీఐ నిందితుణ్ని అరెస్ట్ చేసి సీతాపూర్ జిల్లా జైలుకు తరలించింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యేపై గల కేసులన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

Friday, August 2, 2019

Panic grips Kashmir after J-K govt asks yatris, tourists to leave Valley


అమర్ నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
·       యాత్రికులు తక్షణం లోయ నుంచి వెనక్కి రావాలని ప్రభుత్వ సూచన
జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్రికులే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెను దాడులకు తెగబడనున్నట్లు నిఘా వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని అందించాయి. దాంతో నాలుగు రోజులుగా అమర్ నాథ్ యాత్రికుల్ని ఎక్కడికక్కడ సైన్యం నిలిపివేసింది. నిఘా విభాగాల హెచ్చరికల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రికులు తక్షణం లోయను విడిచి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటీస్ జారీ అయింది. వీలైనంత తొందరగా యాత్రికుల్ని లోయలో వారు బస చేస్తున్న ప్రాంతాల నుంచి వెనక్కి పంపాలని అమర్ నాథ్ యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్న సైనిక విభాగానికి సమాచారమిచ్చింది. మరోవైపు స్థానికులు నిత్యావసర సరుకుల్ని నిల్వ చేసుకుంటున్నారు. గడచిన రెండ్రోజుల్లో సైన్యం అమర్ నాథ్ యాత్ర మార్గంలో తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున మందుపాతరలు వెలుగుచూశాయి. బాంబు నిర్వీర్య దళాలు ఈ శక్తిమంతమైన మందుపాతరను వెలికితీశాయి. బాంబులపై పాకిస్థాన్ ఆయుధాగారం ముద్రను సైన్యం గుర్తించింది. అమెరికా తయారీ అధునాతన తుపాకీ ఎం-24 (పొంచి ఉండి కాల్పులు జరిపేందుకు ఉపయోగించే-స్నైపర్ రైఫిల్) తనిఖీల్లో లభ్యమైంది. దాంతో లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్.ధిలాన్ భద్రతా దళాలకు ఉగ్రవాద ముప్పు గురించి వివరాలందించి సర్వసన్నద్ధం చేశారు. యాత్ర మార్గంలో సైన్యం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే తమకు బేస్ క్యాంప్ నుంచి యాత్ర ముగించాలని ఆదేశాలేవీ అందలేదని యాత్రికులు అంటున్నారు. అయినా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లే భావిస్తున్నామని కొందరు యాత్రికులు తెలిపారు. యాత్రను అర్ధాంతరంగా ముగించాల్సి రావడం నిరాశ కల్గిస్తుందన్నారు. యాత్ర కొనసాగించేందుకు కొందరు యాత్రికులు  నాలుగ్రోజులుగా ఎదురు చూస్తున్నారు. అంతకంతకు పరిస్థితి తీవ్రంగా మారుతుండడంతో అమర్ నాథ్ మంచు శివలింగ దర్శనానికి నోచుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.