Saturday, October 29, 2022

World's 'tallest' Shiva statue unveiled in Rajasthan's Rajsamand

మహాశివయ్య@369

·        రాజస్థాన్ లో విశ్వాస్ స్వరూపం విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాశివుని విగ్రహం రాజస్థాన్ లో కొలువుదీరింది. శనివారం ఈ 369 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు, సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఉదయ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల నాథ్ ద్వారలో ధ్యానముద్రలో కూర్చున్న శివయ్య `విశ్వాస్ స్వరూపం`గా భక్తుల్ని అలరిస్తున్నాడు. 2012లో ముఖ్యమంత్రి గెహ్లొత్ ఆధ్వర్యంలోనే ఈ మహా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భారీ శివయ్య విగ్రహం తయారవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. తాట్ పదమ్ సంస్థాన్ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా చెక్కుచెదరనంత పటిష్టంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు. విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంప్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి సాహసక్రీడలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ లను ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment