అమర్ నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
·
యాత్రికులు తక్షణం లోయ నుంచి వెనక్కి రావాలని ప్రభుత్వ సూచన
జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా అమర్ నాథ్
యాత్రికులే లక్ష్యంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెను దాడులకు
తెగబడనున్నట్లు నిఘా వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని అందించాయి. దాంతో నాలుగు
రోజులుగా అమర్ నాథ్ యాత్రికుల్ని ఎక్కడికక్కడ సైన్యం నిలిపివేసింది. నిఘా విభాగాల
హెచ్చరికల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రికులు తక్షణం లోయను విడిచి వెళ్లాలని ప్రభుత్వం
సూచించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటీస్ జారీ అయింది. వీలైనంత తొందరగా
యాత్రికుల్ని లోయలో వారు బస చేస్తున్న ప్రాంతాల నుంచి వెనక్కి పంపాలని అమర్ నాథ్ యాత్ర
మార్గాన్ని పర్యవేక్షిస్తున్న సైనిక విభాగానికి సమాచారమిచ్చింది. మరోవైపు స్థానికులు
నిత్యావసర సరుకుల్ని నిల్వ చేసుకుంటున్నారు. గడచిన రెండ్రోజుల్లో సైన్యం అమర్ నాథ్
యాత్ర మార్గంలో తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున మందుపాతరలు వెలుగుచూశాయి. బాంబు
నిర్వీర్య దళాలు ఈ శక్తిమంతమైన మందుపాతరను వెలికితీశాయి. బాంబులపై పాకిస్థాన్
ఆయుధాగారం ముద్రను సైన్యం గుర్తించింది. అమెరికా తయారీ అధునాతన తుపాకీ ఎం-24 (పొంచి ఉండి కాల్పులు జరిపేందుకు ఉపయోగించే-స్నైపర్ రైఫిల్) తనిఖీల్లో లభ్యమైంది. దాంతో లెఫ్టినెంట్ జనరల్
కె.జె.ఎస్.ధిలాన్ భద్రతా దళాలకు ఉగ్రవాద ముప్పు గురించి వివరాలందించి సర్వసన్నద్ధం
చేశారు. యాత్ర మార్గంలో సైన్యం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే తమకు బేస్ క్యాంప్
నుంచి యాత్ర ముగించాలని ఆదేశాలేవీ అందలేదని యాత్రికులు అంటున్నారు. అయినా
పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లే భావిస్తున్నామని కొందరు యాత్రికులు తెలిపారు.
యాత్రను అర్ధాంతరంగా ముగించాల్సి రావడం నిరాశ కల్గిస్తుందన్నారు. యాత్ర
కొనసాగించేందుకు కొందరు యాత్రికులు నాలుగ్రోజులుగా ఎదురు చూస్తున్నారు. అంతకంతకు పరిస్థితి
తీవ్రంగా మారుతుండడంతో అమర్ నాథ్ మంచు శివలింగ దర్శనానికి నోచుకోలేకపోతున్నామని
వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment