ఆస్ట్రేలియాలో
స్వచ్ఛంద మరణం పొందిన తొలి కేన్సర్ రోగి
కేన్సర్ తుది దశకు చేరుకుని వ్యధ అనుభవిస్తున్న
ఆస్ట్రేలియా మహిళ కెర్రీ రాబర్ట్ సన్(61) కారుణ్య మరణం పొందారు. యూథనేష్యా (వ్యాధి నయం అవుతుందనే ఆశ లేనప్పుడు మందులతో ప్రాణం
పోగొట్టడం) ద్వారా ప్రాణాలు విడిచిన
తొలి కేన్సర్ రోగి ఆమె. విక్టోరియా రాష్ట్రంలో ఆమె తనకు స్వచ్ఛంద మరణం
ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిపుణులైన వైద్యుల సమక్షంలో మరణాన్ని ఆశ్రయించారు.
ఈ వివాదాస్పద `కారుణ్య మరణ చట్టం` ఆ రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చింది. ఆరు
నెలలకు మించి రోగి బతకరనే వైద్యుల నివేదిక ఆధారంగా సుశిక్షితులైన వైద్యుల
పర్యవేక్షణలో మరణాన్ని ప్రసాదిస్తారు. భరించలేని బాధను అనుభవిస్తున్న రోగి స్వచ్ఛంద
మరణాన్ని కోరుకుంటూ దరఖాస్తు చేసిన 29 రోజులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది.
జూన్ లో ఈ మేరకు అభ్యర్థించిన కెర్రీకి జులైలో ప్రభుత్వం అనుమతించింది. కుటుంబ సభ్యులు
కూడా `ఆమె కోరుకున్న అధికారం మరణం`(The empowered death that she wanted) అని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కెర్రీకి జాక్వి, నికోల్ అనే
ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె అంతిమ ఘడియల్లో బంధువులందరూ దగ్గరే ఉన్నామని.. తన తల్లి
కెర్రి చివరి మాటగా జీవితాన్ని నిరాడంబరంగా, హుందాగా గడపమని సూచించినట్లు నికోల్ రాబర్ట్
సన్ తెలిపింది. ఆమె జీవించిన క్షణాలన్నీ సంతోషంగా ఉండేటట్లు చూసుకున్నామని అలాగే ఆమె
మరణం లోనూ ప్రశాంతంగా సాగిపోయేందుకు సహకరించామంది. రాబర్ట్ సన్ ప్రకటనను `చారిటీ గో
జెంటిల్ ఆస్ట్రేలియా` విడుదల చేసింది. 2010 నుంచి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న
కెర్రీ 2019 జులై వరకు కిమో థెరపీ, రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. ఆమె ఈ
చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో అనేక సైడ్ ఎఫెక్ట్ లకు గురయ్యారు. కేన్సర్ ఆమె
శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయ భాగాలకు
వ్యాధి సోకింది. భరించలేని బాధను అనుభవిస్తున్న ఆమె విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా
వచ్చిన చట్టం ప్రకారం మరణాన్ని పొందింది. ఇదే తరహా కారుణ్య మరణాలు కెనడా, నెథర్లాండ్స్,
బెల్జియంల్లో అమలులో ఉన్నాయి.
No comments:
Post a Comment