Sunday, August 4, 2019

Chandrayan-2 captures imges of earth


చంద్రయాన్-2 తీసిన భూమి చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
చంద్రయాన్ -2 తీసిన భూమి తాజా చిత్రాల్ని ఇస్రో ఆదివారం విడుదల చేసింది. మిషన్ లోని విక్రమ్ లాండర్ అధునాతన ఎల్.ఐ.4 కెమెరా ద్వారా తీసిన చిత్రాలు శనివారం సాయంత్రం 6.28కి భూమికి చేరాయి. వీటిని ఇస్రో అధికారికంగా విడుదల చేసింది. అంతకుముందు వారం రోజుల క్రితం చంద్రయాన్-2 తీసిన చిత్రాలంటూ వైరల్ అయిన ఫొటోలు నకిలీవిగా తేలింది. ప్రస్తుతం ఇస్రో విడుదల చేసిన చంద్రయాన్-2  ఫొటోలు అత్యంత నాణ్యమైనవిగా ఉన్నాయి. వైరల్ అయిన ఫొటోల్లో కొన్ని గతంలో నాసా (అమెరికా) తీసిన చిత్రాలు, మరికొన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) నుంచి వ్యోమగాములు తీసిన చిత్రాలు కావొచ్చని తెలుస్తోంది. వీటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రుడిపైకి చంద్రయాన్-2 రోవర్ సెప్టెంబర్ 7కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం జులై 22న విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-1  ప్రయోగం విజయవంతమైన 11 ఏళ్లకు ఇస్రో ఈ రెండో ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడిపై తొలి ప్రయోగాన్ని ఇస్రో 2008 అక్టోబర్ లో చేపట్టి విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం నీటి జాడల్ని ఇస్రో ఈ ప్రాజెక్టు ద్వారానే ప్రపంచానికి వెల్లడించింది. ప్రస్తుతం చంద్రయాన్-2 రెండు కక్ష్యల్ని దిగ్విజయంగా అధిగమించి ఆగస్ట్ 6న మూడో కక్ష్యలోకి అడుగుపెట్టనుంది. 

No comments:

Post a Comment