ఉన్నావ్ హత్యాచార కేసుల్లో ఎమ్మెల్యే ఆయుధ లైసెన్స్ రద్దు
రాయ్ బరేలీ(యూపీ)లోని ఉన్నావ్
అత్యాచార, హత్య కేసుల్లో నిందితుడైన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్
సింగ్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేశారు.
రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ దేవేందర్ కుమార్ పాండే ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
ఉన్నావ్ లో అత్యాచార కేసును ఎదుర్కొంటున్న కుల్దీప్ కోర్టు విచారణకు హాజరవుతున్న
బాధితుల్ని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేశాడనే అభియోగాలు నమోదయిన సంగతి
తెలిసిందే. బాధితురాలు, బంధువులైన ఇద్దరు మహిళలు, న్యాయవాది కోర్టుకు వెళ్లేందుకు
కారులో ప్రయాణిస్తుండగా ట్రక్కుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి యాక్సిడెంట్ చేశారు. ప్రణాళికా
ప్రకారం చేసిన ప్రమాదంలో బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మహిళలు దుర్మరణం
పాలయ్యారు. దాంతో ఎమ్మెల్యే కుల్దీప్ పై హత్య కేసు సైతం దాఖలయింది. సుప్రీంకోర్టు
ఆదేశాల ప్రకారం ఉన్నావ్ బాధితురాలి ప్రమాద ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును
వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశానుసారం నిందితుడిపై రాయ్ బరేలీ జిల్లా
అధికార వర్గాలు చర్యలకు ఉపక్రమించాయి. తాజాగా అతని ఆయుధాల లైసెన్స్ ను రద్దు
చేశారు. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎమ్మెల్యే కుల్దీప్ పేరిట గల మూడు
ఆయుధ లైసెన్స్ లను నిలిపివేశారు. ప్రమాద ఘటన కేసులో ట్రక్కు డ్రైవర్,క్లీనర్ సహా తొమ్మిది
మందిని సీబీఐ సీతాపూర్ జైలుకు తరలించనుంది. అత్యాచార కేసులో కుల్దీప్ ఇప్పటికే ఈ జైలులో
ఉన్నారు. సీబీఐ 15 రోజుల్లో ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయనుంది. అనంతరం మిగిలిన నిందితుల్ని
సీతాపూర్ జైలుకు తరలించనున్నారు. శనివారం సీబీఐ బృందం ప్రమాద(హత్య) ఘటనలో ప్రాణాలు
కోల్పోయిన వారి బంధువుల్ని కలుసుకుని వారి కథనాన్ని నమోదు చేసింది. ప్రమాదంలో
గాయపడిన న్యాయవాది స్టేట్ మెంట్ ను అధికారులు నమోదు చేయనున్నారు. మరోవైపు బాధితురాలి తల్లి
తన కుమార్తె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం న్యూఢిల్లీలోని
ఆసుపత్రికి తరలించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలికి లక్నోలోని వైద్యశాలలో
కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు. 2017 జూన్ 4న సదరు బాధితురాలు
ఉద్యోగం కోసం వెళ్లగా ఆమెపై బంజెరుమావు ఎమ్మెల్యే కుల్దీప్ అత్యాచారానికి
ఒడిగట్టాడు. దాంతో గత ఏడాది సీబీఐ నిందితుణ్ని అరెస్ట్ చేసి సీతాపూర్ జిల్లా
జైలుకు తరలించింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యేపై గల కేసులన్నింటినీ ఢిల్లీ
కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
No comments:
Post a Comment