Friday, May 3, 2019

it was bear nepal army rejects indian mountaineering team`s yethi claim


యతి పాద ముద్రలు కావు.. అవి మంచు ఎలుగుబంటివన్న నేపాల్

హిమాలయాల్లో ఇటీవల కనిపించినవి యతి పాదముద్రలు కావని అవి మంచు ఎలుగుబంటివని నేపాల్ సైన్యం పేర్కొంది. మకాలు బేస్ క్యాంప్ ప్రాంతంలో కొందరు సాహసికుల బృందం తొలుత ఈ భారీ సైజులోని పాద ముద్రల్ని కనుగొంది. పురాణ కాలం నుంచి యతి మంచుమనిషి ఉనికిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా  యతి పాద ముద్రలు కనిపించాయంటూ హల్ చల్ చేస్తున్న వీడియో క్లిపింగ్ లపై నేపాల్ సైన్యం స్పందించింది. భారత సైన్యం కూడా ఈ పాదముద్రల నిగ్గు తేల్చేందుకు నిపుణుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ బిగ్యాన్ దేవ్ పాండే వివరాలు వెల్లడించారు. సాహసికుల బృందం యతి పాదముద్రలు చూశామని చెబుతున్న ప్రాంతానికి వెళ్లి తమ సైనికబృందం పరిశీలన జరిపిందన్నారు. పురాణాల ప్రకారమైతే 32X15 అంగుళాల సైజులో పాద ముద్రలుండాలి కదా ఇవి అంత పెద్దగా లేవు. కచ్చితంగా మంచు ఎలుగుబంటివేనని దేవ్ పాండే తెలిపారు.

 


fani cyclone heading towards west bengal, rain lashes city.. 3 died in odisha

పశ్చిమబెంగాల్ కు మళ్లుతోన్న ఫొని తుపాను..ఒడిశాలో ముగ్గురి మృతి


కోస్తా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుపాను ఒడిశా తీరం మీదుగా పశ్చిమబెంగాల్ కు మళ్లుతోంది. మే3 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తర, ఈశాన్య దిశలో గంటకు 24 కిలోమీటర్ల వేగంతో కదిలిన పెను తుపాన్ ఫొని తీవ్రతను తగ్గించుకుని ఒడిశా తీరం నుంచి కదులుతోంది. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్ కు 10 కిలోమీటర్లు, కటక్ కు 30 కిలోమీటర్ల వద్ద ఉన్న తుపాన్ క్రమేపి పశ్చిమబెంగాల్ వైపు కదులుతోంది. మే4న మరింత తీవ్రతను తగ్గించుకుని ఫొని తుపాన్ బంగ్లాదేశ్ ను తాకుతుందని వాతావరణ శాఖ (ఐఎండి) వర్గాలు తెలిపాయి. ఉదయం పూరి, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. ఒడిశాలో తుపాన్ ధాటికి ముగ్గురు మృత్యుపాలైనట్లు సమాచారం. ముందస్తు తుపాన్ చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో సంభవించలేదు. ఈదురు గాలుల తీవ్రతకు మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాన్ సహాయక సిబ్బంది వీటిని తొలగించే పనులు చేపట్టారు. రాగల 24 గంటల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండి వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. రాష్ట్రంలో రెడ్ అలర్డ్ ప్రకటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు సహాయక బృందాలను(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దించారు. రెండు రోజులుగా కోలకతా, భువనేశ్వర్ ల్లో విమానాశ్రయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. హౌరా, హుగ్లీ, ఝార్గాం, కోల్ కతా, సుందర్ బన్ ప్రాంతాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

 


Thursday, May 2, 2019

srilanka names all nine people behind easter suicide bombings


శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల నిందితుల వివరాలు వెల్లడి
ఈస్టర్ సండే నాడు (ఏప్రిల్21) వరుస బాంబు పేలుళ్లతో సుమారు 300 మందిని పొట్టనబెట్టుకున్న నిందితుల వివరాల్ని శ్రీలంక వెల్లడించింది. గురువారం (మే2) పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తొమ్మిది మంది నిందితుల పేర్లు ప్రకటించారు. జహరాన్ హషిం(షంగ్రి లా బాంబర్స్- స్థానిక జిహాదీ గ్రూపు నాయకుడు), హషిం(నేషనల్ తౌహీద్ జమాత్-ఎన్జీజే నేత), ఇన్షాఫ్ అహ్మద్, మహ్మద్ అజం ముబారక్ మమ్మద్ (ఇతని భార్య ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది), అహ్మద్ మౌజ్ (ఇతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నాడు), మహ్మద్ హస్తున్, మహ్మద్ నజీర్ మహ్మద్ అసద్, అబ్దుల్ లతీఫ్ (అసద్, లతీఫ్ లు- బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదువుకున్నారు). వరుస పేలుళ్ల తర్వాత అనుమానంతో కొలంబో లో ఓ ఇంటిపై భద్రత బలగాలు దాడి చేయగా ఫాతిమా ఇల్లహమ్ తనంత తాను బాంబు పేల్చేసుకోవడంతో ఆమె ఇద్దరు పిల్లల సహా మరో ఇద్దరు అధికారులు మృత్యువాత పడ్డారు. తీవ్రవాదుల ఆర్థిక వ్యవహారాల నిరోధక చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేయనున్నట్లు గుణశేఖర తెలిపారు.

pm modi reviews preparedness on cyclone fani issues directions


ఫొని తుపాన్ పై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (మే2) ఫొని తుపాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన తుపాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. తుపాన్ కదికలికలను అడిగి తెలుసుకున్న ప్రధాని ఎటువంటి విపత్కర పరిస్థితనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, సైనిక బలగాల మోహరింపు తదితరాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు, టెలికాం సర్వీసులపై అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐ.ఎం.డి, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా ఫొని తుపాన్ శుక్రవారం ఒడిస్సా తీరాన్ని తాకవచ్చని తెలుస్తోంది. దాంతో సుమారు ఎనిమిది లక్షల మంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.