Friday, May 3, 2019

fani cyclone heading towards west bengal, rain lashes city.. 3 died in odisha

పశ్చిమబెంగాల్ కు మళ్లుతోన్న ఫొని తుపాను..ఒడిశాలో ముగ్గురి మృతి


కోస్తా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుపాను ఒడిశా తీరం మీదుగా పశ్చిమబెంగాల్ కు మళ్లుతోంది. మే3 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తర, ఈశాన్య దిశలో గంటకు 24 కిలోమీటర్ల వేగంతో కదిలిన పెను తుపాన్ ఫొని తీవ్రతను తగ్గించుకుని ఒడిశా తీరం నుంచి కదులుతోంది. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్ కు 10 కిలోమీటర్లు, కటక్ కు 30 కిలోమీటర్ల వద్ద ఉన్న తుపాన్ క్రమేపి పశ్చిమబెంగాల్ వైపు కదులుతోంది. మే4న మరింత తీవ్రతను తగ్గించుకుని ఫొని తుపాన్ బంగ్లాదేశ్ ను తాకుతుందని వాతావరణ శాఖ (ఐఎండి) వర్గాలు తెలిపాయి. ఉదయం పూరి, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. ఒడిశాలో తుపాన్ ధాటికి ముగ్గురు మృత్యుపాలైనట్లు సమాచారం. ముందస్తు తుపాన్ చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో సంభవించలేదు. ఈదురు గాలుల తీవ్రతకు మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాన్ సహాయక సిబ్బంది వీటిని తొలగించే పనులు చేపట్టారు. రాగల 24 గంటల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండి వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. రాష్ట్రంలో రెడ్ అలర్డ్ ప్రకటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు సహాయక బృందాలను(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దించారు. రెండు రోజులుగా కోలకతా, భువనేశ్వర్ ల్లో విమానాశ్రయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. హౌరా, హుగ్లీ, ఝార్గాం, కోల్ కతా, సుందర్ బన్ ప్రాంతాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

 


No comments:

Post a Comment