Monday, July 8, 2019

BCCI appoints Dravid as Head of Cricket at NCA


ఎన్.సి.ఎ. అధినాయకుడిగా మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్

నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్.సి.ఎ) హెడ్ గా భారత జట్టు మాజీ కెప్టెన్ క్రికెట్ వాల్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. సోమవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. జులై 1నే వాస్తవానికి ద్రవిడ్ ఎంపిక జరిగింది. అయితే అతను ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. `ఒక వ్యక్తికి ఒకే పదవి` అనే నియమం ప్రకారం ఎన్.సి.ఎ. అధ్యక్షుడు ఆదాయాన్ని చేకూర్చే ఏ ఇతర పదవుల్లో ఉండకూడదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) సభ్యత్వాన్ని అందులో భాగంగానే వదులుకున్నారు. అడ్వయిజరీ కమిటీ (సి.ఒ.ఎ) ఇండియా సిమెంట్స్ పదవిని త్యజించడం లేదా దీర్ఘకాలిక సెలవు పెట్టుకుని ఎన్.సి.ఎ. హెడ్ బాధ్యతలు స్వీకరించాలని ద్రవిడ్ కు సూచించింది. ఇండియా సిమెంట్స్ సెలవు మంజూరు చేయడంతో ద్రవిడ్ ఎన్.సి.ఎ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వీలుకల్గింది. ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఎన్.సి.ఎ పదవిలో ద్రవిడ్ భారత క్రికెట్ కు సంబంధించి పలు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ పురుషుల, మహిళల జట్ల హెడ్ కోచ్ లు సహా కోచ్ లందరికి ద్రవిడ్ నేతృత్వం వహిస్తారు. క్రీడాకారులకు కీలక శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇండియా-ఎ, ఇండియా అండర్-19, అండర్-23 జట్లు కూడా ఎన్.సి.ఎ హెడ్ పరిధిలోనే ముందంజ వేయనున్నాయి. ఇంతకు ముందు ఎన్.సి.ఎ. చైర్మన్ గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

ISRO chief Sivan visits Udupi, Kollur temples


ఉడుపి, కొల్లూర్ దేవాలయాల్ని సందర్శించిన ఇస్రో చైర్మన్ శివన్
చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం, దేవాలయాల్ని భార్య మాలతి శివన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ సోమవారం ఆయన ఈ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30కు శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న శివన్, కుటుంబ సభ్యుల్ని విద్యాదీశాతీర్థ స్వామి మిషన్ విజయవంతం కావాలంటూ ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-1 ప్రాజెక్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇస్రో రానున్న సోమవారం జులై 15 న సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. తొలుత ఈ ఉదయం శివన్, కుటుంబ సభ్యులు కొల్లూరు ముకాంభిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ మఠానికి వెళ్లి స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Sunday, July 7, 2019

Drones, snipers to keep hawk's eye on Kanwar Yatra


యూపీలో కున్వార్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు
ఉత్తరప్రదేశ్ మీదుగా ఈనెల 17న సాగే కున్వార్ యాత్ర పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఏటా జరిగే ఈ కున్వార్ యాత్రలో వేల మంది శివ భక్తులు పాల్గొంటారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఈ కున్వార్ యాత్ర ప్రారంభమవుతుంది. హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి(ఉత్తరాఖండ్), సుల్తాన్ గంజ్(బిహార్) యాత్రల సమాహారమే ఈ కున్వార్ యాత్ర. ఇందులో పాల్గొన్న భక్తులు ఆయా ప్రాంతాల్లోని పవిత్ర గంగా జలాన్ని సేకరించి యాత్ర కొనసాగిస్తారు. ఇందుకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించింది. యూపీ ప్రధానకార్యదర్శి అనూప్ చంద్ర పాండే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒ.పి.సింగ్(డీజీపీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఈ సమావేశంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి పశ్చిమ యూపీకి చెందిన గౌతమ్ బుద్ధా నగర్, ఘజియాబాద్, హపూర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు హాజరయ్యారు.
యాత్రకు ఎటువంటి విఘాతం కల్గకుండా ఆధునాతన పరికరాలతో నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆకాశమార్గం(ఏరియల్ సర్వీలెన్స్)లో హెలికాప్టర్, డ్రోన్స్ మోహరించనున్నారు. ఉగ్రవాద నిరోధక దళం(యాంటీ టెర్రర్ స్క్వాడ్-ఏటీఎస్) సేవల్ని కున్వార్ యాత్ర మార్గంలో వినియోగించనున్నారు. ప్రతి 5 కి.మీ. పరిధిలో పోలీసు, ఇతర సహాయక దళాల్ని మోహరిస్తున్నారు. ఏదైనా సహాయానికి నంబర్ 100 కు డయల్ చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కున్వార్ యాత్ర సందర్భంగా 2017లో 36, 2018లో 17 అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్లు డీజీపీ సింగ్ తెలిపారు. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి అవరోధాలు కల్గకుండా చూసేందుకు మొత్తం 8వేల మందితో కూడిన పోలీసు దళాల్ని వినియోగిస్తున్నామన్నారు. మీరట్ ముజ్ఫర్ నగర్, సహరాన్పూర్ మార్గంలో ఏటీఎస్ దళాల్ని మోహరిస్తున్నట్లు డీజీపీ వివరించారు. వీరికి తోడుగా స్నైపర్స్ (అజ్ఞాతంగా కావలి కాచే సాయుధ బృందం) ను సిద్ధం చేశామన్నారు. యాత్ర సజావుగా సాగేందుకు కున్వార్ యాత్ర మొబైల్ యాప్ ను రూపొందించినట్లు మీరట్ డివిజన్ కమిషనర్ అనిత మెష్రామ్ తెలిపారు.

MSDhoni turns a year older, team a bit wiser


ధోని పుట్టినరోజును వేడుకలా జరుపుకున్న టీమిండియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 38వ ఏట అడుగుపెట్టాడు.1981 జులై7న ఝార్కండ్ రాజధాని రాంచిలో పాన్ సింగ్, దేవకీదేవీ దంపతులకు జన్మించాడు. ఈ లెజెండ్ కెప్టెన్, స్టార్ కీపర్ బ్యాట్స్ మన్ పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం భారత క్రికెట్ జట్టు సభ్యులు వేడుకలా జరుపుకున్నారు. శ్రీలంకపై ఘన విజయం తర్వాత మాంచెస్టర్ కు బస్ లో బయలుదేరిన జట్టు సభ్యులు అందులోనే తమ ప్రియతమ ఆటగాడి జన్మదిన వేడుకల్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు. రికార్డుల స్టార్ ఓపెనర్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలిపాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వాస్తవానికి తను నాయకుడైనా తమ సారథి ధోనియేనని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాడు. జట్టు హోటల్ కు చేరుకున్నాక భార్య సాక్షి, కూతురు జీవా లతో కలిసి కేక్ కోసిన ధోని ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు సందడి చేశారు. ఈ వరల్డ్ కప్ తో ధోని రిటైర్మెంట్ కానున్నాడు. 2011 వరల్డ్ కప్ సచిన్ టెండుల్కర్ చివరి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ. ఆ కప్ ను ధోని సారథ్యంలోని భారత్ జట్టు గెలిచి సచిన్ కు కానుకగా సమర్పించింది. అప్పటి కెప్టెన్, వైస్ కెప్టెన్లు ధోని, యువరాజ్ సహా జట్టు మొత్తం వరల్డ్ కప్ ను పట్టుకుని ఉన్న సచిన్ టెండుల్కర్ ను భుజాలకెత్తుకుని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానమంతా కలియదిరుగుతూ సంబరం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి వరల్డ్ కప్ ను భారత్ సాధించింది. క్రికెట్ మక్కాగా పేరోందిన లండన్ లార్డ్స్ మైదానంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తదితర జట్టు సభ్యులు వరల్డ్ కప్ పట్టుకున్న కపిల్ దేవ్ చెయ్యిని సగర్వంగా పైకెత్తి అభినందించారు. ప్రస్తుతం ఆ మధురస్మృతుల్ని కోహ్లి, రోహిత్ సేన పునరావృతం చేయాల్సి ఉంది. ఇటీవల సచిన్ టెండుల్కర్ తర్వాత భారత జట్టు నుంచి అంతటి పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా పొందుతున్న గొప్ప క్రికెట్ యోధుడు ధోని. అతని రిటైర్మెంట్ ప్రకటన సమయానికి మరోసారి వరల్డ్ కప్ భుజాలకెత్తుకుని `మెన్ ఇన్ బ్లూ` ధోనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలన్నదే కోటానుకోట్ల క్రికెట్ అభిమానుల ప్రగాఢ కోరిక.