Monday, July 8, 2019

BCCI appoints Dravid as Head of Cricket at NCA


ఎన్.సి.ఎ. అధినాయకుడిగా మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్

నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్.సి.ఎ) హెడ్ గా భారత జట్టు మాజీ కెప్టెన్ క్రికెట్ వాల్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. సోమవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. జులై 1నే వాస్తవానికి ద్రవిడ్ ఎంపిక జరిగింది. అయితే అతను ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. `ఒక వ్యక్తికి ఒకే పదవి` అనే నియమం ప్రకారం ఎన్.సి.ఎ. అధ్యక్షుడు ఆదాయాన్ని చేకూర్చే ఏ ఇతర పదవుల్లో ఉండకూడదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) సభ్యత్వాన్ని అందులో భాగంగానే వదులుకున్నారు. అడ్వయిజరీ కమిటీ (సి.ఒ.ఎ) ఇండియా సిమెంట్స్ పదవిని త్యజించడం లేదా దీర్ఘకాలిక సెలవు పెట్టుకుని ఎన్.సి.ఎ. హెడ్ బాధ్యతలు స్వీకరించాలని ద్రవిడ్ కు సూచించింది. ఇండియా సిమెంట్స్ సెలవు మంజూరు చేయడంతో ద్రవిడ్ ఎన్.సి.ఎ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వీలుకల్గింది. ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఎన్.సి.ఎ పదవిలో ద్రవిడ్ భారత క్రికెట్ కు సంబంధించి పలు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ పురుషుల, మహిళల జట్ల హెడ్ కోచ్ లు సహా కోచ్ లందరికి ద్రవిడ్ నేతృత్వం వహిస్తారు. క్రీడాకారులకు కీలక శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇండియా-ఎ, ఇండియా అండర్-19, అండర్-23 జట్లు కూడా ఎన్.సి.ఎ హెడ్ పరిధిలోనే ముందంజ వేయనున్నాయి. ఇంతకు ముందు ఎన్.సి.ఎ. చైర్మన్ గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment