Sunday, July 7, 2019

MSDhoni turns a year older, team a bit wiser


ధోని పుట్టినరోజును వేడుకలా జరుపుకున్న టీమిండియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 38వ ఏట అడుగుపెట్టాడు.1981 జులై7న ఝార్కండ్ రాజధాని రాంచిలో పాన్ సింగ్, దేవకీదేవీ దంపతులకు జన్మించాడు. ఈ లెజెండ్ కెప్టెన్, స్టార్ కీపర్ బ్యాట్స్ మన్ పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం భారత క్రికెట్ జట్టు సభ్యులు వేడుకలా జరుపుకున్నారు. శ్రీలంకపై ఘన విజయం తర్వాత మాంచెస్టర్ కు బస్ లో బయలుదేరిన జట్టు సభ్యులు అందులోనే తమ ప్రియతమ ఆటగాడి జన్మదిన వేడుకల్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు. రికార్డుల స్టార్ ఓపెనర్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలిపాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వాస్తవానికి తను నాయకుడైనా తమ సారథి ధోనియేనని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాడు. జట్టు హోటల్ కు చేరుకున్నాక భార్య సాక్షి, కూతురు జీవా లతో కలిసి కేక్ కోసిన ధోని ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు సందడి చేశారు. ఈ వరల్డ్ కప్ తో ధోని రిటైర్మెంట్ కానున్నాడు. 2011 వరల్డ్ కప్ సచిన్ టెండుల్కర్ చివరి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ. ఆ కప్ ను ధోని సారథ్యంలోని భారత్ జట్టు గెలిచి సచిన్ కు కానుకగా సమర్పించింది. అప్పటి కెప్టెన్, వైస్ కెప్టెన్లు ధోని, యువరాజ్ సహా జట్టు మొత్తం వరల్డ్ కప్ ను పట్టుకుని ఉన్న సచిన్ టెండుల్కర్ ను భుజాలకెత్తుకుని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానమంతా కలియదిరుగుతూ సంబరం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి వరల్డ్ కప్ ను భారత్ సాధించింది. క్రికెట్ మక్కాగా పేరోందిన లండన్ లార్డ్స్ మైదానంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తదితర జట్టు సభ్యులు వరల్డ్ కప్ పట్టుకున్న కపిల్ దేవ్ చెయ్యిని సగర్వంగా పైకెత్తి అభినందించారు. ప్రస్తుతం ఆ మధురస్మృతుల్ని కోహ్లి, రోహిత్ సేన పునరావృతం చేయాల్సి ఉంది. ఇటీవల సచిన్ టెండుల్కర్ తర్వాత భారత జట్టు నుంచి అంతటి పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా పొందుతున్న గొప్ప క్రికెట్ యోధుడు ధోని. అతని రిటైర్మెంట్ ప్రకటన సమయానికి మరోసారి వరల్డ్ కప్ భుజాలకెత్తుకుని `మెన్ ఇన్ బ్లూ` ధోనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలన్నదే కోటానుకోట్ల క్రికెట్ అభిమానుల ప్రగాఢ కోరిక.

No comments:

Post a Comment