Monday, July 8, 2019

ISRO chief Sivan visits Udupi, Kollur temples


ఉడుపి, కొల్లూర్ దేవాలయాల్ని సందర్శించిన ఇస్రో చైర్మన్ శివన్
చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం, దేవాలయాల్ని భార్య మాలతి శివన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ సోమవారం ఆయన ఈ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30కు శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న శివన్, కుటుంబ సభ్యుల్ని విద్యాదీశాతీర్థ స్వామి మిషన్ విజయవంతం కావాలంటూ ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-1 ప్రాజెక్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇస్రో రానున్న సోమవారం జులై 15 న సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. తొలుత ఈ ఉదయం శివన్, కుటుంబ సభ్యులు కొల్లూరు ముకాంభిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ మఠానికి వెళ్లి స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Sunday, July 7, 2019

Drones, snipers to keep hawk's eye on Kanwar Yatra


యూపీలో కున్వార్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు
ఉత్తరప్రదేశ్ మీదుగా ఈనెల 17న సాగే కున్వార్ యాత్ర పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఏటా జరిగే ఈ కున్వార్ యాత్రలో వేల మంది శివ భక్తులు పాల్గొంటారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఈ కున్వార్ యాత్ర ప్రారంభమవుతుంది. హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి(ఉత్తరాఖండ్), సుల్తాన్ గంజ్(బిహార్) యాత్రల సమాహారమే ఈ కున్వార్ యాత్ర. ఇందులో పాల్గొన్న భక్తులు ఆయా ప్రాంతాల్లోని పవిత్ర గంగా జలాన్ని సేకరించి యాత్ర కొనసాగిస్తారు. ఇందుకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించింది. యూపీ ప్రధానకార్యదర్శి అనూప్ చంద్ర పాండే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒ.పి.సింగ్(డీజీపీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఈ సమావేశంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి పశ్చిమ యూపీకి చెందిన గౌతమ్ బుద్ధా నగర్, ఘజియాబాద్, హపూర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు హాజరయ్యారు.
యాత్రకు ఎటువంటి విఘాతం కల్గకుండా ఆధునాతన పరికరాలతో నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆకాశమార్గం(ఏరియల్ సర్వీలెన్స్)లో హెలికాప్టర్, డ్రోన్స్ మోహరించనున్నారు. ఉగ్రవాద నిరోధక దళం(యాంటీ టెర్రర్ స్క్వాడ్-ఏటీఎస్) సేవల్ని కున్వార్ యాత్ర మార్గంలో వినియోగించనున్నారు. ప్రతి 5 కి.మీ. పరిధిలో పోలీసు, ఇతర సహాయక దళాల్ని మోహరిస్తున్నారు. ఏదైనా సహాయానికి నంబర్ 100 కు డయల్ చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కున్వార్ యాత్ర సందర్భంగా 2017లో 36, 2018లో 17 అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్లు డీజీపీ సింగ్ తెలిపారు. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి అవరోధాలు కల్గకుండా చూసేందుకు మొత్తం 8వేల మందితో కూడిన పోలీసు దళాల్ని వినియోగిస్తున్నామన్నారు. మీరట్ ముజ్ఫర్ నగర్, సహరాన్పూర్ మార్గంలో ఏటీఎస్ దళాల్ని మోహరిస్తున్నట్లు డీజీపీ వివరించారు. వీరికి తోడుగా స్నైపర్స్ (అజ్ఞాతంగా కావలి కాచే సాయుధ బృందం) ను సిద్ధం చేశామన్నారు. యాత్ర సజావుగా సాగేందుకు కున్వార్ యాత్ర మొబైల్ యాప్ ను రూపొందించినట్లు మీరట్ డివిజన్ కమిషనర్ అనిత మెష్రామ్ తెలిపారు.

MSDhoni turns a year older, team a bit wiser


ధోని పుట్టినరోజును వేడుకలా జరుపుకున్న టీమిండియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 38వ ఏట అడుగుపెట్టాడు.1981 జులై7న ఝార్కండ్ రాజధాని రాంచిలో పాన్ సింగ్, దేవకీదేవీ దంపతులకు జన్మించాడు. ఈ లెజెండ్ కెప్టెన్, స్టార్ కీపర్ బ్యాట్స్ మన్ పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం భారత క్రికెట్ జట్టు సభ్యులు వేడుకలా జరుపుకున్నారు. శ్రీలంకపై ఘన విజయం తర్వాత మాంచెస్టర్ కు బస్ లో బయలుదేరిన జట్టు సభ్యులు అందులోనే తమ ప్రియతమ ఆటగాడి జన్మదిన వేడుకల్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు. రికార్డుల స్టార్ ఓపెనర్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలిపాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వాస్తవానికి తను నాయకుడైనా తమ సారథి ధోనియేనని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాడు. జట్టు హోటల్ కు చేరుకున్నాక భార్య సాక్షి, కూతురు జీవా లతో కలిసి కేక్ కోసిన ధోని ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు సందడి చేశారు. ఈ వరల్డ్ కప్ తో ధోని రిటైర్మెంట్ కానున్నాడు. 2011 వరల్డ్ కప్ సచిన్ టెండుల్కర్ చివరి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ. ఆ కప్ ను ధోని సారథ్యంలోని భారత్ జట్టు గెలిచి సచిన్ కు కానుకగా సమర్పించింది. అప్పటి కెప్టెన్, వైస్ కెప్టెన్లు ధోని, యువరాజ్ సహా జట్టు మొత్తం వరల్డ్ కప్ ను పట్టుకుని ఉన్న సచిన్ టెండుల్కర్ ను భుజాలకెత్తుకుని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానమంతా కలియదిరుగుతూ సంబరం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి వరల్డ్ కప్ ను భారత్ సాధించింది. క్రికెట్ మక్కాగా పేరోందిన లండన్ లార్డ్స్ మైదానంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తదితర జట్టు సభ్యులు వరల్డ్ కప్ పట్టుకున్న కపిల్ దేవ్ చెయ్యిని సగర్వంగా పైకెత్తి అభినందించారు. ప్రస్తుతం ఆ మధురస్మృతుల్ని కోహ్లి, రోహిత్ సేన పునరావృతం చేయాల్సి ఉంది. ఇటీవల సచిన్ టెండుల్కర్ తర్వాత భారత జట్టు నుంచి అంతటి పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా పొందుతున్న గొప్ప క్రికెట్ యోధుడు ధోని. అతని రిటైర్మెంట్ ప్రకటన సమయానికి మరోసారి వరల్డ్ కప్ భుజాలకెత్తుకుని `మెన్ ఇన్ బ్లూ` ధోనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలన్నదే కోటానుకోట్ల క్రికెట్ అభిమానుల ప్రగాఢ కోరిక.

Saturday, July 6, 2019

Australia in struggling to chage 326 target, south africa in fight back


ఆస్ట్రేలియాను కంగు తినిపించిన దక్షిణాఫ్రికా
§  సెమీస్-1: భారత్ x న్యూజిలాండ్  §  సెమీస్-2: ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్
కంగారూల జట్టు ఆస్ట్రేలియాపై కొదమసింహలా పోరాడిన దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 మాంచెస్టర్ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ నం.45 లో సఫారీల జట్టు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 భారీ పరుగుల్ని చేసింది. జట్టు కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయిన ఫాప్ డూప్లెసిస్(100) సెంచరీ సాధించాడు. రస్సీ వాండర్ సన్(95) ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఓపెనర్లు అడెన్ మర్క్రామ్(34), కీపర్ బ్యాటర్ క్వింటాన్ డికాక్(52) రాణించడంతో భారీ స్కోరును ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముందుంచారు. ఆసీస్ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ లయాన్ చెరో 2 వికెట్లు, జాసన్ బెరండ్రాఫ్, పాట్ కమిన్స్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం 326 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూల జట్టు భారీ స్కోరయినా ప్రత్యర్థికి దాసోహం అనేదే లేదు అన్నట్లుగా పోరాడింది. ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(3) స్పిన్నర్ తాహిర్ బౌలింగ్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి త్వరగా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సీనియర్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్(122) టోర్నీలో మరో సెంచరీతో కదం తొక్కాడు. మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరె(85) పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించినా జట్టులో చివరి వరుస బ్యాట్స్ మెన్ నిలబడకపోవడంతో విజయాన్ని సాధించిపెట్టలేకపోయాడు. మార్కస్ స్టోయినిస్(22) మాత్రమే జట్టులో చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఉస్మాన్ ఖవాజా(18), మిషెల్ స్టార్క్(16) స్కోరు అందుకునే క్రమంలో రబాడ వేసిన 49 ఓవర్లో వెంటవెంటనే వెనుదిరగడంతో చివరి 6 బంతుల్లో ఒక్క వికెట్ చేతిలో ఉండగా 18 పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది. పెహ్లుక్వాయో వేసిన 50 ఓవర్ నాల్గు బంతుల్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా రనౌట్ నుంచి తప్పించుకున్న లయాన్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో మార్క్రమ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. బెరండ్రాఫ్(11*) నాటౌట్ గా మిగిలాడు. 49.5 ఓవర్లలో ఆసిస్ 315 పరుగులకు ఆలౌటయింది. సఫారీల బౌలర్లలో కగిసొ రబాడకు 3 వికెట్లు దక్కగా, డ్వయిన్ ప్రెటోరిస్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్ లు చెరో వికెట్ తీశారు.