ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నాయకుల శుభాకాంక్షలు
2020 నూతన సంవత్సరం
సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు
తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు చెప్పారు. జనవరి 1 బుధవారం అమరావతిలోని
రాజ్ భవన్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ కు పిల్లలు
పుష్పగుచ్ఛాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి
సుబ్బారెడ్డితో పాటు డాలర్ శేషాద్రి తదితరులు గవర్నర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీటీడీ పండితులు ఈ కార్యక్రమంలో
పాల్గొని గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలందరూ ఈ
ఏడాది ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు
విషెస్ తెల్పుతూ ఈ సంవత్సరం యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని
వేడుకున్నట్లు చెప్పారు. గడిచిన ఏడాది రాష్ట్ర ప్రజలు చిరునవ్వులతో తమ
ప్రభుత్వాన్ని ఆహ్వానించి ఆనందంగా గడిపారని ఈ ఏడాది అందరి ఇళ్లల్లో సంతోషం
వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు
మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలని దుర్గమ్మని వేడుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని
కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దంపతులు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ తను నాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారన్నారు. కానీ నేడు 2020 సత్ఫలితాల్ని
తెలంగాణ అనుభవిస్తోందని చెప్పారు. నూతన సంవత్సరం తొలిరోజున దుర్గమ్మని దర్శించుకొని
అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. `రాష్ట్ర రాజధానిగా అమరావతి
ఉండాలి..అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి`..అని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలని
చంద్రబాబు కోరారు. ఆయనకు దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో
స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు.
No comments:
Post a Comment