Sunday, June 23, 2019

Cop burns alive as car catches fire after collision


కూతురు నిశ్చితార్థానికి వస్తుండగా కారు ప్రమాదం: ఎస్.ఐ. సజీవదహనం

విధులు ముగించుకుని కూతురు వివాహ నిశ్చితార్థానికి బయలుదేరిన ఓ ఎస్.ఐ. కారు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా లీమా చౌహాన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్న అశోక్ తివారీ ఆదివారం ఈ ఘోర ప్రమాదంలో మృత్యు ఒడికి చేరారు. అలహాబాద్ నుంచి కారులో బయలుదేరిన ఆయన భోపాల్ మీదుగా ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతున్న ఆనందంలో ఉన్న ఆయనను దుర్ఘటన బలి తీసుకుంది. రాజ్ గఢ్ జిల్లా పాన్ వాడి గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారులో మంటలు వ్యాపించాయి. కారుతో పాటు ఎస్.ఐ.ను మంటలు చుట్టుముట్టడంతో మృతి చెందారు. ట్రక్కు ఢీకొన్న క్రమంలోనే కారులో మంటలు ప్రజ్వరిల్లినట్లు ఎస్.డి.ఒ.పి (సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్) నాగేంద్ర సింగ్ బియాస్ తెలిపారు.

Six Indians arrested for smuggling gold in Sri Lanka



కొలంబోలో బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురి అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టయ్యారు. వీరంతా భారత్ కు చెందిన వారని సమాచారం. ఆదివారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల్లో వీరు పట్టబడ్డారు. నిందితులు తమ బ్యాగులు, ప్యాంటుల్లో బంగారు బిస్కెట్లు దాచి ఉంచడం సోదాల్లో బట్టబయలయింది. వీటి విలువ రూ.30 లక్షలుంటుందని అంచనా. నిందితులందరూ 36-53 వయసు లోపు వారని డెయిలీ మిర్రర్ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ దందాపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సునీల్ జయరత్నే తెలిపారు.



Saturday, June 22, 2019

tough fight goes between westindies and newzealand in icc world cup match

ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండిస్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రపంచ క్రికెట్ అభిమానులు మరోసారి కళ్లారా వీక్షించారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓడినా వెస్టిండిస్ బ్యాటింగ్ ను ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. తొలుత గేల్ చెలరేగితే ఆ తర్వాత కార్లస్ బ్రాత్ వెయిట్ విజృంభించిన తీరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.29 మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వెస్టిండిస్ దాదాపు ఓడించినంత పని చేసింది. వెస్టిండిస్ టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు పోగొట్టుకుని 291 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148) టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ 292 పరుగుల లక్ష్య ఛేదనకు ఏమాత్రం వెరవలేదు. చాన్నాళ్లకు ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 6 సిక్సర్లు, 8 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 84 బంతుల్లోనే 87 పరుగులు చేసి అయిదో వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కీపర్ షాయ్ హోప్(1), నికోలస్ పూరన్(1) ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(0) మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత షిమ్రాన్ హెట్మయర్(54), కార్లోస్ బ్రాత్ వెయిట్(101) ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అపురూపమనే చెప్పాలి. ముఖ్యంగా బ్రాత్ వెయిట్ 82 బంతుల్లోనే 5 సిక్సర్లు, 9 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. సిక్సర్లు, బౌండరీలతోనే వెయిట్ 66 పరుగుల సాధించాడంటేనే అతని విజృంభణ ఏస్థాయిలో ఉందో చెప్పొచ్చు. చివర్లో 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో అందరూ వెస్టిండిస్ గెలుస్తుందనే అనుకున్నారు. ఒకే ఒక వికెట్ మిగిలి ఉన్నదశలో వెయిట్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. నీషం బౌలింగ్ లో బౌల్ట్ క్యాచ్ పట్టగా వెయిట్ వెనుదిరగడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 4 వికెట్లు, లొకీ ఫెర్గుసన్ కు 3 వికెట్లు లభించగా మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, కోలిన్డె గ్రాండ్ హోమ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(0), కోలిన్ మన్రో(0) డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పుడు క్రీజ్ లో కొచ్చిన కెప్టెన్ విలియమ్సన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. అతనికి రాస్ టేలర్(69) అండగా నిలవగా నీషమ్ (28) చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 4 వికెట్లు, కార్లోస్ బ్రాత్ వెయిట్ 2 వికెట్లు పడగొట్టారు.

Priyanka congratulates shruti mishra on her selection to indian squad for asian jr championship


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రుతి మిశ్రాను అభినందించిన ప్రియాంక
ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్ షిప్ కు గాను భారత జట్టుకు ఎంపికైన శ్రుతి మిశ్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభినందించారు. ఈ చాంపియన్ షిప్ చైనాలో ప్రారంభం కానుంది. యూపీ రాజధాని లక్నో కు చెందిన శ్రుతి ఎంపిక కావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి కూడా అయిన ప్రియాంక ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపారు. `బాగా శ్రమిస్తే విజయం నీ వెంట..నీకు నీ జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలు` అని ఆ పోస్ట్ లో ప్రియాంక రాశారు.